Showing posts with label Dasharathi Krishnamacharya. Show all posts
Showing posts with label Dasharathi Krishnamacharya. Show all posts

Saturday, 22 July 2017

దాశరథి సాహిత్యం సజీవం


           - డా. రాయారావు సూర్య ప్రకాశ్ రావు

ఒకే వాక్యం – ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’. తెలంగాణ ఘన చరిత నినాదంగా రూపొందిన వాక్యం. మరో వాక్యం – ‘మా నిజాము రాజు, జన్మ జన్మాల బూజు’. నిజాం వ్యతిరేక రణన్నినాదం. ఇంకో వాక్యం- ‘అనాదిగా సాగుతోంది సంగ్రామం – అనాథునికి, ఆగర్భ శ్రీమంతునికీ’. వర్గ పోరాటానికి దర్పణం పట్టే వాక్యం. ఒక్కో వాక్యంతో ఒక్కో కావ్య సృజనకు సరిసమానమైన ఘనత సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి మహా కవి దాశరథి కృష్ణమాచార్యులు.
మధ్యాహ్న మార్తాండుని ఉష్ణ ప్రతాపం, పున్నమి చంద్రుని వెన్నెల చల్లదనం కలగలిస్తే అచ్చం దాశరథి కృష్ణమాచార్యుల సాహిత్యం లాగానే ఉంటుంది. “ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని’ అని నిజాంకు వ్యతిరేకంగా పోరాట బావుటా ఎగరేసినపుడు ఎంత తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శించారో “ఖుషీ ఖుషీగా నవ్వుతూ – చలాకి మాటలు రువ్వుతూ – హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా!” అన్నప్పుడు అంతే తీవ్రమైన భావావేశాన్ని రంగరించారు. సాంప్రదాయత, ఆధునికత కలగలిసిన సాహిత్య స్వరూపం దాశరథి. “అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో” అని ఆకలితో అలమటించే సమాజం ఉండకూడదని  ఎంత ఆవేదనతో పలవరించారో, “రారా కృష్ణయ్యా... రారా కృష్ణయ్యా.. దీనులను కాపాడ రారా కృష్ణయ్యా” అంటూ అంతే ఆర్ద్రతతో ఈ బాధలను దూరం చేసేందుకు రమ్మని కృష్ణుడిని ఆహ్వానించారు.
1925 జూలై 22న నేటి మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు గ్రామంలో వెంకటమ్మ, వేంకటాచార్యులు అనే దంపతులకు మొదటి సంతానంగా దాశరథి జన్మించారు. స్వగ్రామంలోనే నాలుగో తరగతి చదువుకున్నారు. ఆ తర్వాత ఖమ్మంలోని ఉస్మానియా ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. స్వాతంత్ర్య సమరం వల్ల మెట్రిక్యులేషన్ తోనే ఆయన చదువు ఆగిపోయింది. ఆ తర్వాత చాలాకాలానికి 1949లో ప్రైవేటుగా ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1952లో ఆంగ్ల సాహిత్యం ఐఛ్చికంగా డిగ్రీ చేశారు.
మొదట్లో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేసిన దాశరథి అనంతరం గ్రామ పంచాయితీ తనిఖీ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత 1956 నుండి 1963 వరకు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో సహాయ ప్రయోక్తగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో పనిచేసి 1970లో రాజీనామా చేశారు.
ఉద్యమాల్లో క్రియాశీల భూమిక నిర్వర్తించారు దాశరథి. నాటి నిజాం ప్రభుత్వం ఆయనను ఖైదు చేసి, కారాగారంలో ఉంచింది. అయినా ఆయన జడుసుకోలేదు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైలు గోడల పైనే పద్యాలు రచించారు. తన ఉపన్యాసాలతో ప్రజల్లో నిజాం వ్యతిరేక భావనలను ప్రేరేపించారు. ఆంద్ర సారస్వత పరిషత్తు స్థాపనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రచయితల సంఘాన్ని 1953లో స్థాపించారు.
పద్య గద్య ప్రక్రియల్లో అసమాన ప్రతిభ ప్రదర్శించారు దాశరథి. కథలు, కవితలు, నాటికలు, సినిమా పాటలు రాశారు. నవలలు, వ్యాసాలు, ముందుమాటలు, నిఘంటువులు, గేయాలు, బాల సాహిత్యం, జంట కవిత్వం, లేఖా సాహిత్యం, అనువాదం మొదలైన ప్రక్రియల్లో శ్లాఘనీయమైన కృషి చేశారు.
‘అగ్ని ధార’, ‘రుద్రవీణ’, ‘పూల పాటలు’, ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘అమృతాభిషేకము’, ‘మహాబోధి’ మొదలైన రచనలు చేశారు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్లను ‘గాలిబ్ గీతాలు’ పేరిట తెలుగులోకి అనువదించారు. తాను ఉద్యమంలోకి ప్రవేశించిన నాటి నుండి విశాలాంధ్ర అవతరణ వరకు తన అనుభవాలను డెబ్బై వారాలపాటు ‘యాత్రాస్మృతి’ పేరిట అందించారు.
భద్రాచల రామదాసు రచించిన ‘దాశరథి శతకం’లో ఉపయోగించిన ‘దాశరథీ! కరుణాపయోనిధీ!’ అనే మకుటాన్ని ఉపయోగించి ‘అభినవ దాశరథి శతకం’ రచించారు దాశరథి. కంచెర్ల గోపన్న రచించిన ‘దాశరథి శతకం’ భక్తి రస ప్రధానమైనది కాగా దాశరథి రచించిన ‘అభినవ దాశరథి శతకం’ సమకాలీన రాజకీయ, సాంఘిక, సాహిత్య రంగాల అధిక్షేపాత్మక, వ్యంగ్యాత్మక విశ్లేషణ.
రేడియో మాధ్యమంగా దాశరథి ‘మహా పరినిర్వాణము’, ‘తెలంగాణ’, ‘ఏకశిల’, ‘హోళీ’, ‘యశోధర’, ‘గోల్కొండ’ తదితర నాటికలను రాశారు. ‘నవమి’ అనే పేరుతో ఆయన రచించిన నాటికల్లో తొమ్మిది ప్రచురితమయ్యాయి. ‘పూచిన మోడుగులు’, ‘రక్తాంజలి’, ‘నిప్పు పూలు’, ‘వెన్నెల్లో చీకటి’ మొదలైన కథలను ఆయన రచించారు. ‘మహాశిల్పి జక్కన’ అనే చారిత్రాత్మక నవలికను కూడా ఆయన రాశారు. సుప్రసిద్ధ హిందీ రచయిత ఆరిగపూడి రమేశ్ చౌదరి రచించిన ‘ఝాడ్ ఫానూస్’ అనే హిందీ నవలను ‘అద్దాల మేడ’ పేరుతో అనువదించారు. ‘భారతంలోని ఉపాఖ్యానాలు’ పురాణేతిహాసాలపై దాశరథికి ఉన్న సమగ్ర అవగాహనకు ఒక నిదర్శనం.
1961లో ‘వాగ్దానం’, ‘ఇద్దరు మిత్రులు’ చిత్రాలతో చలన చిత్ర రంగ ప్రవేశం చేసి, దాదాపు రెండు దశాబ్దాల కాలం చలన చిత్రాలకు వందలాది పాటలు రాశారు. ‘రంగుల రాట్నం’ చిత్రంలోని ‘నడిరేయి ఏ జాములో’, ‘బుద్ధిమంతుడు’ చిత్రంలోని ‘నను పాలింపగ నడచి వచ్చితివా’, ‘మేన కోడలు’ చిత్రంలోని ‘తిరుమల మందిర సుందరా’, ‘మంచి మనిషి’ చిత్రంలోని ‘ఓహో గులాబి బాలా’, ‘లక్ష్మీ నివాసం’ చిత్రంలోని ‘ధనమేరా అన్నిటికీ మూలం’, ‘మూగ మనసులు’ చిత్రంలోని ‘గోదారి గట్టుంది.. గట్టు మీద చెట్టుంది’ మొదలైన అనేక పాటలు ఇప్పటికీ తెలుగువారి నాల్కలపై నాట్యం చేస్తుంటాయి.
‘మంజీర’, ‘స్రవంతి’ పత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు దాశరథి. ‘బాల సరస్వతి తెలుగు- ఇంగ్లీషు నిఘంటువు’ కర్తల్లో ఆయన కూడా ఒకరు. పింగళి- కాటూరి సాహిత్య పీఠానికి కులపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలకు గౌరవ ప్రయోక్తగా పనిచేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రధాన సలహాదారుగా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర, మధుర, అన్నామలై విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి, ఫిలిం సర్టిఫికేషన్ బోర్డుకు, కేంద్ర సాహిత్య అకాడమీకి, సెంట్రల్ పబ్లికేషన్స్ డివిజన్ కు సభ్యులుగా దాశరథి పనిచేశారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఆస్థాన కవిగా నియమించింది. ఆ పదవిలో 1977 నుండి 1983 వరకు పనిచేశారు. ‘కవితా పుష్పకం’ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్  సాహిత్య అకాడమీ పురస్కారం, ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటికి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. మీర్జా గాలిబ్ గజళ్ల అనువాదం ‘గాలిబ్ గీతాలు’ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అనువాద పురస్కారం పొందింది.
‘మహాకవి’, ‘అభ్యుదయ కవి చక్రవర్తి’, ‘యువకవి చక్రవర్తి’ అనే బిరుదాలను పొందారు దాశరథి. కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘జాతీయోద్యమ రథసారథి’గా గుర్తించింది. ఇందిరాగాంధీ చేతులమీదుగా ఆయన సన్మానం పొందారు. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను ‘కళా ప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది. 1976లో ఆగ్రా విశ్వవిద్యాలయం, 1981లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్) గౌరవ పట్టాతో సన్మానించాయి. 1978లో ‘అమెరికా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ’ ఆయనను ‘ఆంధ్ర కవితా సారథి’ అనే బిరుదుతో గౌరవించింది.
1971లో జరిగిన ఒంగోలు జిల్లా రచయితల మహాసభల్లో దాశరథి ఎడమ కాలికి అప్పటి రాష్ట్ర మంత్రి నారపరెడ్డి స్వయంగా గండపెండేరాన్ని తొడిగారు. 1975లో దాశరథికి యాభయ్యేళ్లు నిండిన సందర్భంగా అప్పటి ఉప రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ విజయవాడలో ఆయనను ఘనంగా సత్కరించారు. గజల్, రుబాయీ ప్రక్రియలను వివిధ భాషల్లో అధ్యయనం చేసేందుకు నాటి కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆయనకు సీనియర్ ఫెలోషిప్ ను ఇచ్చింది.  
పలు దేశాల్లో దాశరథి పర్యటించారు. మలేషియా, సింగపూర్, ఇంగ్లాండు, అమెరికా, కెనడా, మెక్సికో, జర్మనీ, ఫ్రాన్సు, బంగ్లాదేశ్, రష్యా తదితర దేశాల్లో వివిధ సభల్లో పాల్గొని, తన వాణిని వినిపించారు. ఆయా దేశాల విశేషాలతో పలు వ్యాసాలు రచించారు. ‘విపులాచ పృథ్వీ’, ‘అమెరికా దర్శనం’, ‘మలయ భాషా స్వరూప స్వభావాలు’ తదితర రచనల్లో ఆయన యాత్రావిశేషాలు కనిపిస్తాయి.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన ప్రతిభను ప్రదర్శించిన దాశరథి కృష్ణమాచార్యుల సాహిత్యం ‘దిక్కులేని పేదవాళ్ల డొక్కలలో పిక్కటిల్లు ఆకలిమంటలు’ ఉన్నంతకాలం సజీవంగా ఉంటుంది. ‘కాంతిని కనబడనివ్వని గాడాంధకారాల మీద శాంతిని వినబడనివ్వని రణ ఘీంకారాల మీద ధ్వజమెత్తిన ప్రజ’ కు అండగా వెలుతురు వెదజల్లుతూనే ఉంటుంది.