Tuesday 23 March 2021

కుంభకర్ణ నిద్ర

 

దాదాపు పాతికేళ్ల కిందటి ముచ్చట. అప్పుడే బీఈడీ పూర్తి చేసుకుని కాలేజీ నుండి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాం. ఒక మిత్రుడు, నేను హైదరాబాదు నగర శివార్లలో అద్దెకు ఉండేవాళ్ళం. రెండు గదుల పోర్షన్. లోపలి గదిలో పడక. రూం బయట కొద్ది దూరంలో టాయిలెట్ ఉండేది. నాతో పాటు ఉన్న రూమ్మేటుకు ఒక అర్ధరాత్రి అర్జెంటుగా బయటికి టాయిలెట్ కి వెళ్ళవలసి వచ్చింది. గాఢ నిద్రలో ఉన్న నన్ను నిద్ర నుండి లేపాడు. “బయటికి టాయిలెట్ కి వెళ్తున్నాను” అని చెప్పాడు. “సరే”నన్నాను. తలుపు తీసి బయటికి వెళ్ళాడు. నాకేమో నిద్ర ముంచుకొస్తోంది. తలుపు తెరిచి పడుకుందామంటే దొంగల భయం. “రూమ్మేటు వచ్చాక తలుపు తడితే ఎలాగూ లేచి తలుపు తీయొచ్చులే” అనుకుని తలుపు పెట్టి, లోపలి గదిలో నిద్రపోయాను.

*****

తెల్లవారుజామున మెలకువ వచ్చింది. పక్కన చూస్తే మిత్రుడు లేడు. “ఎక్కడికెళ్ళాడా” అని కొన్ని సెకన్లు ఆలోచిస్తే, రాత్రి అతను బయటికి వెళ్ళిన విషయం గుర్తొచ్చింది. “ఇంతసేపైనా ఇంకా రాలేదేంటి?” అనుకుంటూ తలుపు తెరిచాను. బయట చూసేసరికి పక్కింటి వాళ్ల చిన్న ఆటోలో నిద్రలో కూడా దోమలను  కొట్టుకుంటూ, మోకాళ్లు దగ్గరికి ముడుచుకుని, సర్దుకుని పడుకున్న మిత్రుడు కనబడ్డాడు. వెళ్ళి లేపాను. “ఏంటి? ఇక్కడ పడుకున్నావ్?” అని అడిగాను. “ఏం చేయాలి మరి? రాత్రి ఎంతో సేపు తలుపు కొట్టాను. నువ్వు తీయలేదు” అన్నాడు. ఇంతలో అలికిడికి పక్కింటివాళ్లు వచ్చారు. “ఏం సార్? పాపం సార్ రాత్రి ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తీయలేదు?” అని ప్రశ్నించారు. “మేం కూడా చాలాసేపు తలుపు కొట్టాం సార్. మీరు లేవలేదు” అని చెప్పారు. “లోపలి రూంలో నిద్ర పోయాను కదా. వినబడలేదు” అని చెప్పాను. మిత్రుడికి సారీ చెప్పాను.

కానీ అంతమంది తలుపు కొట్టినా మెలకువ రాకపోవడం ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నా మొద్దు నిద్రతో మిత్రుడిని ఇబ్బంది పెట్టినందుకు బాధగానూ ఉంటుంది.  

అదే కదా కుంభకర్ణ నిద్ర అంటే!