Saturday 22 July 2017

దాశరథి సాహిత్యం సజీవం


           - డా. రాయారావు సూర్య ప్రకాశ్ రావు

ఒకే వాక్యం – ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’. తెలంగాణ ఘన చరిత నినాదంగా రూపొందిన వాక్యం. మరో వాక్యం – ‘మా నిజాము రాజు, జన్మ జన్మాల బూజు’. నిజాం వ్యతిరేక రణన్నినాదం. ఇంకో వాక్యం- ‘అనాదిగా సాగుతోంది సంగ్రామం – అనాథునికి, ఆగర్భ శ్రీమంతునికీ’. వర్గ పోరాటానికి దర్పణం పట్టే వాక్యం. ఒక్కో వాక్యంతో ఒక్కో కావ్య సృజనకు సరిసమానమైన ఘనత సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి మహా కవి దాశరథి కృష్ణమాచార్యులు.
మధ్యాహ్న మార్తాండుని ఉష్ణ ప్రతాపం, పున్నమి చంద్రుని వెన్నెల చల్లదనం కలగలిస్తే అచ్చం దాశరథి కృష్ణమాచార్యుల సాహిత్యం లాగానే ఉంటుంది. “ఓ నిజాము పిశాచమా! కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని’ అని నిజాంకు వ్యతిరేకంగా పోరాట బావుటా ఎగరేసినపుడు ఎంత తీవ్రమైన ఆగ్రహాన్ని ప్రదర్శించారో “ఖుషీ ఖుషీగా నవ్వుతూ – చలాకి మాటలు రువ్వుతూ – హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా!” అన్నప్పుడు అంతే తీవ్రమైన భావావేశాన్ని రంగరించారు. సాంప్రదాయత, ఆధునికత కలగలిసిన సాహిత్య స్వరూపం దాశరథి. “అన్నార్తులు, అనాథలుండని ఆ నవయుగమదెంత దూరమో” అని ఆకలితో అలమటించే సమాజం ఉండకూడదని  ఎంత ఆవేదనతో పలవరించారో, “రారా కృష్ణయ్యా... రారా కృష్ణయ్యా.. దీనులను కాపాడ రారా కృష్ణయ్యా” అంటూ అంతే ఆర్ద్రతతో ఈ బాధలను దూరం చేసేందుకు రమ్మని కృష్ణుడిని ఆహ్వానించారు.
1925 జూలై 22న నేటి మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు గ్రామంలో వెంకటమ్మ, వేంకటాచార్యులు అనే దంపతులకు మొదటి సంతానంగా దాశరథి జన్మించారు. స్వగ్రామంలోనే నాలుగో తరగతి చదువుకున్నారు. ఆ తర్వాత ఖమ్మంలోని ఉస్మానియా ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. స్వాతంత్ర్య సమరం వల్ల మెట్రిక్యులేషన్ తోనే ఆయన చదువు ఆగిపోయింది. ఆ తర్వాత చాలాకాలానికి 1949లో ప్రైవేటుగా ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి 1952లో ఆంగ్ల సాహిత్యం ఐఛ్చికంగా డిగ్రీ చేశారు.
మొదట్లో కొంతకాలం అధ్యాపకునిగా పనిచేసిన దాశరథి అనంతరం గ్రామ పంచాయితీ తనిఖీ ఇన్ స్పెక్టర్ గా పనిచేశారు. ఆ తర్వాత 1956 నుండి 1963 వరకు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రంలో సహాయ ప్రయోక్తగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో పనిచేసి 1970లో రాజీనామా చేశారు.
ఉద్యమాల్లో క్రియాశీల భూమిక నిర్వర్తించారు దాశరథి. నాటి నిజాం ప్రభుత్వం ఆయనను ఖైదు చేసి, కారాగారంలో ఉంచింది. అయినా ఆయన జడుసుకోలేదు. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జైలు గోడల పైనే పద్యాలు రచించారు. తన ఉపన్యాసాలతో ప్రజల్లో నిజాం వ్యతిరేక భావనలను ప్రేరేపించారు. ఆంద్ర సారస్వత పరిషత్తు స్థాపనలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రచయితల సంఘాన్ని 1953లో స్థాపించారు.
పద్య గద్య ప్రక్రియల్లో అసమాన ప్రతిభ ప్రదర్శించారు దాశరథి. కథలు, కవితలు, నాటికలు, సినిమా పాటలు రాశారు. నవలలు, వ్యాసాలు, ముందుమాటలు, నిఘంటువులు, గేయాలు, బాల సాహిత్యం, జంట కవిత్వం, లేఖా సాహిత్యం, అనువాదం మొదలైన ప్రక్రియల్లో శ్లాఘనీయమైన కృషి చేశారు.
‘అగ్ని ధార’, ‘రుద్రవీణ’, ‘పూల పాటలు’, ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘అమృతాభిషేకము’, ‘మహాబోధి’ మొదలైన రచనలు చేశారు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్లను ‘గాలిబ్ గీతాలు’ పేరిట తెలుగులోకి అనువదించారు. తాను ఉద్యమంలోకి ప్రవేశించిన నాటి నుండి విశాలాంధ్ర అవతరణ వరకు తన అనుభవాలను డెబ్బై వారాలపాటు ‘యాత్రాస్మృతి’ పేరిట అందించారు.
భద్రాచల రామదాసు రచించిన ‘దాశరథి శతకం’లో ఉపయోగించిన ‘దాశరథీ! కరుణాపయోనిధీ!’ అనే మకుటాన్ని ఉపయోగించి ‘అభినవ దాశరథి శతకం’ రచించారు దాశరథి. కంచెర్ల గోపన్న రచించిన ‘దాశరథి శతకం’ భక్తి రస ప్రధానమైనది కాగా దాశరథి రచించిన ‘అభినవ దాశరథి శతకం’ సమకాలీన రాజకీయ, సాంఘిక, సాహిత్య రంగాల అధిక్షేపాత్మక, వ్యంగ్యాత్మక విశ్లేషణ.
రేడియో మాధ్యమంగా దాశరథి ‘మహా పరినిర్వాణము’, ‘తెలంగాణ’, ‘ఏకశిల’, ‘హోళీ’, ‘యశోధర’, ‘గోల్కొండ’ తదితర నాటికలను రాశారు. ‘నవమి’ అనే పేరుతో ఆయన రచించిన నాటికల్లో తొమ్మిది ప్రచురితమయ్యాయి. ‘పూచిన మోడుగులు’, ‘రక్తాంజలి’, ‘నిప్పు పూలు’, ‘వెన్నెల్లో చీకటి’ మొదలైన కథలను ఆయన రచించారు. ‘మహాశిల్పి జక్కన’ అనే చారిత్రాత్మక నవలికను కూడా ఆయన రాశారు. సుప్రసిద్ధ హిందీ రచయిత ఆరిగపూడి రమేశ్ చౌదరి రచించిన ‘ఝాడ్ ఫానూస్’ అనే హిందీ నవలను ‘అద్దాల మేడ’ పేరుతో అనువదించారు. ‘భారతంలోని ఉపాఖ్యానాలు’ పురాణేతిహాసాలపై దాశరథికి ఉన్న సమగ్ర అవగాహనకు ఒక నిదర్శనం.
1961లో ‘వాగ్దానం’, ‘ఇద్దరు మిత్రులు’ చిత్రాలతో చలన చిత్ర రంగ ప్రవేశం చేసి, దాదాపు రెండు దశాబ్దాల కాలం చలన చిత్రాలకు వందలాది పాటలు రాశారు. ‘రంగుల రాట్నం’ చిత్రంలోని ‘నడిరేయి ఏ జాములో’, ‘బుద్ధిమంతుడు’ చిత్రంలోని ‘నను పాలింపగ నడచి వచ్చితివా’, ‘మేన కోడలు’ చిత్రంలోని ‘తిరుమల మందిర సుందరా’, ‘మంచి మనిషి’ చిత్రంలోని ‘ఓహో గులాబి బాలా’, ‘లక్ష్మీ నివాసం’ చిత్రంలోని ‘ధనమేరా అన్నిటికీ మూలం’, ‘మూగ మనసులు’ చిత్రంలోని ‘గోదారి గట్టుంది.. గట్టు మీద చెట్టుంది’ మొదలైన అనేక పాటలు ఇప్పటికీ తెలుగువారి నాల్కలపై నాట్యం చేస్తుంటాయి.
‘మంజీర’, ‘స్రవంతి’ పత్రికలకు సంపాదకునిగా వ్యవహరించారు దాశరథి. ‘బాల సరస్వతి తెలుగు- ఇంగ్లీషు నిఘంటువు’ కర్తల్లో ఆయన కూడా ఒకరు. పింగళి- కాటూరి సాహిత్య పీఠానికి కులపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలకు గౌరవ ప్రయోక్తగా పనిచేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రధాన సలహాదారుగా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర, మధుర, అన్నామలై విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ప్రొఫెసర్ గా కూడా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘానికి, ఫిలిం సర్టిఫికేషన్ బోర్డుకు, కేంద్ర సాహిత్య అకాడమీకి, సెంట్రల్ పబ్లికేషన్స్ డివిజన్ కు సభ్యులుగా దాశరథి పనిచేశారు.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఆస్థాన కవిగా నియమించింది. ఆ పదవిలో 1977 నుండి 1983 వరకు పనిచేశారు. ‘కవితా పుష్పకం’ గ్రంథానికి ఆంధ్రప్రదేశ్  సాహిత్య అకాడమీ పురస్కారం, ‘తిమిరంతో సమరం’ కవితా సంపుటికి 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. మీర్జా గాలిబ్ గజళ్ల అనువాదం ‘గాలిబ్ గీతాలు’ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అనువాద పురస్కారం పొందింది.
‘మహాకవి’, ‘అభ్యుదయ కవి చక్రవర్తి’, ‘యువకవి చక్రవర్తి’ అనే బిరుదాలను పొందారు దాశరథి. కేంద్ర ప్రభుత్వం ఆయనను ‘జాతీయోద్యమ రథసారథి’గా గుర్తించింది. ఇందిరాగాంధీ చేతులమీదుగా ఆయన సన్మానం పొందారు. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను ‘కళా ప్రపూర్ణ’ బిరుదుతో సత్కరించింది. 1976లో ఆగ్రా విశ్వవిద్యాలయం, 1981లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లెటర్స్ (డి.లిట్) గౌరవ పట్టాతో సన్మానించాయి. 1978లో ‘అమెరికా గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ’ ఆయనను ‘ఆంధ్ర కవితా సారథి’ అనే బిరుదుతో గౌరవించింది.
1971లో జరిగిన ఒంగోలు జిల్లా రచయితల మహాసభల్లో దాశరథి ఎడమ కాలికి అప్పటి రాష్ట్ర మంత్రి నారపరెడ్డి స్వయంగా గండపెండేరాన్ని తొడిగారు. 1975లో దాశరథికి యాభయ్యేళ్లు నిండిన సందర్భంగా అప్పటి ఉప రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ విజయవాడలో ఆయనను ఘనంగా సత్కరించారు. గజల్, రుబాయీ ప్రక్రియలను వివిధ భాషల్లో అధ్యయనం చేసేందుకు నాటి కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆయనకు సీనియర్ ఫెలోషిప్ ను ఇచ్చింది.  
పలు దేశాల్లో దాశరథి పర్యటించారు. మలేషియా, సింగపూర్, ఇంగ్లాండు, అమెరికా, కెనడా, మెక్సికో, జర్మనీ, ఫ్రాన్సు, బంగ్లాదేశ్, రష్యా తదితర దేశాల్లో వివిధ సభల్లో పాల్గొని, తన వాణిని వినిపించారు. ఆయా దేశాల విశేషాలతో పలు వ్యాసాలు రచించారు. ‘విపులాచ పృథ్వీ’, ‘అమెరికా దర్శనం’, ‘మలయ భాషా స్వరూప స్వభావాలు’ తదితర రచనల్లో ఆయన యాత్రావిశేషాలు కనిపిస్తాయి.
బహుముఖ ప్రజ్ఞాశాలిగా తన ప్రతిభను ప్రదర్శించిన దాశరథి కృష్ణమాచార్యుల సాహిత్యం ‘దిక్కులేని పేదవాళ్ల డొక్కలలో పిక్కటిల్లు ఆకలిమంటలు’ ఉన్నంతకాలం సజీవంగా ఉంటుంది. ‘కాంతిని కనబడనివ్వని గాడాంధకారాల మీద శాంతిని వినబడనివ్వని రణ ఘీంకారాల మీద ధ్వజమెత్తిన ప్రజ’ కు అండగా వెలుతురు వెదజల్లుతూనే ఉంటుంది.







Thursday 13 July 2017

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖలో విధుల్లో చేరిన సురేశ్ కుమార్ గారు



ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అమెరికాకు వెళ్ళిన సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి ఎస్. సురేశ్ కుమార్  గారు కేంద్ర ప్రభుత్వంలో తిరిగి విధుల్లో చేరారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేబినేట్ మంత్రికి ఆంతరంగిక కార్యదర్శిగా ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టారు.
  విధి నిర్వహణలో అత్యంత సమర్థుడిగా పేరు తెచ్చుకున్న సురేశ్ కుమార్ గారు 2000 సంవత్సరం  ఐ.ఎ.ఎస్. బ్యాచుకు చెందినవారు. ఆయన 1972 మే  25 న జన్మించారు. ఫారెస్ట్రీలో డిగ్రీ చేశారు. సిల్వి కల్చర్ లో ఎమ్మెస్సీ పూర్తిచేశారు. 2002లో తూర్పు గోదావరి జిల్లాలో అసిస్టెంటు కలెక్టరుగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన 2003 వరకు అదే హోదాలో అక్కడే పనిచేశారు. అనంతరం అదే జిల్లాలో 2004 జనవరి నుండి జూన్ వరకు సబ్ కలెక్టరుగా పనిచేశారు. ఆ తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో భద్రాచలం ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారిగా ఎడాదిన్నరపాటు పనిచేశారు. ఆ కాలంలో గిరిజనాభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టరుగా 2008 మార్చి వరకు పనిచేసిన ఆయన అనంతరం 2010 వరకు చిత్తూరు జిల్లా సంయుక్త కలెక్టరుగా విధులు నిర్వర్తించారు.





  ఆ తర్వాత మెదక్ జిల్లా కలెక్టరుగా ఎస్. సురేశ్ కుమార్ గారు 2010 ఏప్రిల్ 12న బాధ్యతలు చేపట్టారు. మెదక్ జిల్లాలో పనిచేసిన కాలంలో అన్నివర్గాల ప్రజల మన్ననలు పొందారు. విద్య, వైద్య రంగాల్లో తనదైన ముద్ర వేశారు. వివిధ శాఖల సమన్వయంతో బడి బయటి పిల్లలను బడులలో చేర్చే ఆశయంతో ఒక రోడ్ మ్యాప్ రూపొందించారు. బాలల దినోత్సవమైన నవంబరు 14ను ఈ ఆశయ సాధనకు ఒక సందర్భంగా నిర్ణయించారు. ఎన్నడూ లేనంత ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించి, ఆ ఆశయ సాధనకు శ్రీకారం చుట్టారు. అనంతరం వయోజన విద్యాశాఖ, రాజీవ్ విద్యా మిషన్, యూనిసెఫ్, కార్మిక శాఖ, జాతీయ బాలకార్మిక ప్రాజెక్టులను సమన్వయ పరిచి సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటర్లు, ఎం.ఆర్.పి.ల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో గ్రామ సమన్వయకర్తలకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటర్ల ఆధ్వర్యంలో బడి బయటి పిల్లల గుర్తింపు కోసం సర్వే చేపట్టారు.

  ఎంతోకాలంగా మెదక్ జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్న సమీకృత కలెక్టరేటును అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు చొరవ చూపారు. జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం ‘పరిష్కారం’ సెల్ ప్రారంభించారు. బాలకార్మిక సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబర్ ఆవిష్కరించారు. ఉద్యోగ మేళా ద్వారా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించారు. రైతులకు 640 కోట్ల రూపాయల మేర రుణాలను రుణ మేళాల్లో అందజేశారు. విద్యారంగంలో ఉత్తమ ఫలితాల సాధన కోసం ‘సంపూర్ణ విద్యాదర్శిని’ అనే పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి, సమర్థవంతంగా అమలు చేశారు. ఈ ప్రాజెక్టుతో సహా పలు ఇ-గవర్నన్స్ ప్రాజెక్టులను అమలు చేసినందుకు గుంటూరులో పనిచేసే కాలంలో ఆయన కేంద్ర ప్రభుత్వ పురస్కారం అందుకున్నారు.


  మెదక్ జిల్లా తర్వాత 2012 జూలైలో కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన గుంటూరు జిల్లాలోనూ అదే ఒరవడి కొనసాగించారు. పారిశుధ్య కార్యక్రమాలపై గుంటూరులో ప్రత్యేక శ్రద్ధ కనబరిచి ప్రశంసలందుకున్నారు. ‘స్వచ్ఛ గుంటూరు’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేశారు. మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగులో పట్టు సాధించారు. అధికార భాషగా తెలుగు అమలులో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రభుత్వ పురస్కారం స్వీకరించారు. మీ-సేవ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం పొందారు. గుంటూరులో  కలెక్టరుగా ఉన్న కాలంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని సమర్థవంతంగా నిర్వహించి, పలువురు ప్రముఖుల అభినందనలందుకున్నారు.



  అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేబినేట్ మంత్రికి ఆంతరంగిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సురేశ్ కుమార్ గారు కేంద్రం లోనూ తనదైన ముద్ర వేశారు. పట్టణాభివృద్ధి శాఖలో కీలక భూమిక నిర్వర్తించారు. విశ్వ విఖ్యాత డ్యూక్ విశ్వవిద్యాలయంలోని సాన్ ఫర్డ్  స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ లో అంతర్జాతీయ అభివృద్ధి విధానంలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు గత సంవత్సరం అమెరికా వెళ్ళారు. ఈ సంవత్సరం మే 14న డ్యూక్ విశ్వవిద్యాలయం నుండి  స్నాతకోత్తర పట్టా స్వీకరించారు. తిరిగి వచ్చిన అనంతరం తిరిగి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేబినేట్ మంత్రికి ఆంతరంగిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అమెరికాలో పొందిన విద్యాపరమైన పరిజ్ఞానం, అనుభవం  తోడ్పాటుతో పట్టణాభివృద్ధి శాఖను ప్రగతి మార్గంలో పరుగు పెట్టిస్తారని, దేశాభివృద్ధి కోసం కొత్త పథకాల అమలుకు బాటలు వేస్తారని ఆకాంక్షిద్దాం. 


Wednesday 12 July 2017

హరితహారం- ప్రగతిసారం ( హరితహారం ప్రారంభం సందర్భంగా ప్రచురితమైన కవిత)


మూడో విడత హరితహారం ప్రారంభం సందర్భంగా నేటి 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా కవిత

http://epaper.ntnews.com/c/20468235

Monday 10 July 2017

ఆధునికాంధ్ర కవిత్వం- సినారె పరిశోధన (అమ్మంగి వేణుగోపాల్ గారి వ్యాసం)



'నమస్తే తెలంగాణ' దినపత్రిక సాహిత్య అనుబంధం 'చెలిమె' పేజీలో 10.07.2017 నాడు ప్రచురితమైన అమ్మంగి వేణుగోపాల్ గారి వ్యాసం 

Thursday 6 July 2017

సంగీత హిమగిరి శిఖరం (జూలై 6న మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)


సంగీత హిమగిరి శిఖరం
-      డాక్టర్ రాయారావు సూర్య ప్రకాశ్ రావు
సంగీత, సాహిత్య రంగాలలో హిమగిరి శిఖరం మంగళంపల్లి బాల మురళీ కృష్ణ. వినూత్న రాగ, తాళాల సృష్టికర్త ఆయన. జుగల్ బందీ తరహా ప్రక్రియలను రూపొందించి, సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సుస్థిరపరచుకున్న పుంభావ కళా సరస్వతి ఆయన. పాతికవేల కచేరీలు చేసి భారతీయ సంగీత ఉత్కృష్టతను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన సంగీత కళానిధి ఆయన.  తన గాత్ర పారవశ్యంలో ప్రపంచాన్ని ముంచెత్తిన నయాగరా జలపాతం బాలమురళి. అపూర్వమైన స్వర, గమక కల్పనతో రస హృదయులను తన్మయత్వం చెందించిన సంగీత చక్రవర్తి ఆయన.
తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో 1930 జూలై ఆరున పట్టాభిరామయ్య, సూర్యకాంతం దంపతులకు మంగళంపల్లి బాలమురళీ కృష్ణ జన్మించారు. ఆరు నెలలు కూడా నిండకుండానే తల్లి సూర్యకాంతం చనిపోయారు. దాంతో అన్నీ తానై పెంచారు తండ్రి పట్టాభిరామయ్య. ఆరేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకోవడం ఆరంభించారు బాలమురళి. ఆయనకు తొలి గురువు తండ్రి పట్టాభిరామయ్య. ఆ తర్వాత కొచ్చర్లకోట రామరాజు దగ్గర సంగీతం అభ్యసించారు. తమిళనాడు లోని పక్షితీర్థానికి చెందిన సుబ్రహ్మణ్యం అయ్యర్ దగ్గర శిష్యరికం చేశారు. అనంతరం సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి దగ్గర శిష్యుడిగా చేరారు. దక్షిణామూర్తి శాస్త్రి  తదనంతరం ఆయన శిష్యులు పారుపల్లి రామకృష్ణయ్య వద్ద సంగీత అభ్యసనను కొనసాగించారు.
ఎనిమిదేళ్ల ప్రాయంలోనే 1938లో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య ఏర్పాటు చేసిన సద్గురు ఆరాధనోత్సవాల సందర్భంగా తొలి కచేరీ చేశారు. తొలి కచేరీ తోనే రసజ్ఞుల ప్రశంసలందుకున్నారు. ప్రముఖ హరికథా విద్వాంసులు ముసునూరి సత్యనారాయణ ఆ కచేరీకి హాజరయ్యారు. చిన్నారి బాలుడైన మురళీకృష్ణ కచేరీకి ముగ్ధులై, ఆయన  పేరుకు ముందు 'బాల' అనే పదాన్ని ఆయనే జోడించారు.
పదకొండేళ్లకే మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుండి కచేరీ నిర్వహించారు బాల మురళీ కృష్ణ. అక్కడినుండి ఇక వెనుతిరిగి చూడలేదు. ఆయన సంగీత జీవితంలో ఎన్నో మైలురాళ్లు. గాయకుడిగా, వాగ్గేయకారుడిగా, సంగీత దర్శకుడిగా నిరుపమానమైన ప్రఖ్యాతినార్జించారు. స్వయంగా కీర్తనలను రాయడమే కాకుండా స్వరపరిచారు. స్వరరాగ సుధలో ఓలలాడించడమే కాకుండా వాద్య కారుడిగానూ ప్రసిద్ధుడయ్యారు.  వయోలిన్, వీణ, మృదంగం మొదలైన వాయిద్యాలలో నిష్ణాతుడు మంగళంపల్లి. త్యాగరాజ కీర్తనలకు తన గానంతో జీవం పోశారు. కర్ణాటక సంగీతంతో పాటు లలిత సంగీతంలోనూ ఆయన కృషి చేశారు.
పండిట్ భీమసేన్ జ్యోషి వంటివారితో కలిసి ఆయన కచేరీలు నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా,  కిశోర్ అమోన్ కర్ మొదలైన వారితో జుగల్ బందీ చేశారు. భద్రాచల రామదాసు కేర్తనలకు, అన్నమాచార్య కీర్తనలకు గాత్రం అందించారు.
సంగీత ప్రపంచానికి బాలమురళీ కృష్ణ అనేక రాగాలను అందజేశారు. తన తల్లి పేరుతో సూర్యకాంత రాగాన్ని సృజించారు. మహతి, లవంగి, ఓంకారి, సుముఖం, సర్వశ్రీ,, ప్రతి మధ్యమావతి, గణపతి సిద్ధి మొదలైన కొత్త రాగాలను సంగీత సరస్వతికి బహుమతిగా సమర్పించారు.
వినూత్న తాళ ప్రక్రియలనూ ఆయన ఆవిష్కరించారు. త్రిముఖి, పంచముఖి, సప్తముఖి, నవముఖిగా ఆ తాళాలను ప్రధానంగా వర్గీకరించారు. స్వరం, రాగం, తాళం, లయలపై సంపూర్ణ సాధికారత ఆయన సొంతం.
వరలక్ష్మీ పిక్చర్స్ వారి 'సతీసావిత్రి' తో 1957లో ఆయన సినీరంగ ప్రయాణం ప్రారంభమైంది. 400 పైగా చలన చిత్రాలకు సంగీతం అందించారు. 'నర్తన శాల' చిత్రంలో 'సలలిత రాగ సుధారస సారం', ముత్యాల ముగ్గు' సినిమాలో 'శ్రీరామ జయరామ', 'మేఘ సందేశం' చిత్రంలో 'పాడనా వాణి కళ్యాణిగా', 'శ్రీరామాంజనేయ యుద్ధం' సినిమాలో 'మేలుకో శ్రీరామా', 'గుప్పెడు మనసు' చిత్రంలో 'మౌనమె నీ భాష ఓ మూగ మనసా' మొదలైన పాటలు ఆయనకు విశేష ఖ్యాతినార్జించి పెట్టాయి.
తెలుగులో ‘జయభేరి’, ‘నర్తనశాల’, ‘ముత్యాలముగ్గు’, ‘దొరికితే దొంగలు’; కన్నడలో ‘హంస గీతె’, ‘మధ్వాచార్య’, ‘ముత్తిన హార’; మలయాళంలో ‘స్వాతి తిరునాళ్’; తమిళంలో ‘నవరతినం’, ‘కవిక్కుయిల్’; సంస్కృతంలో ‘ఆది శంకరాచార్య’ మొదలైన చలనచిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.  కన్నడ సినిమా ‘హంస గీతె’కు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా 1976లో పురస్కారం స్వీకరించారు. మరో కన్నడ చలనచిత్రం ‘మధ్వాచార్య’కు జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా 1987లో అవార్డు పొందారు. 2011లో గ్లోబల్ ఇండియన్ మ్యూజిక్ అకాడమీ జీవన సాఫల్య పురస్కారం పొందారు.
బాలమురళీకృష్ణ భారతీయ సంగీత ఉత్కృష్టతను ప్రపంచానికి చాటిచెప్పిన సంగీత కళానిధి. అమెరికా, బ్రిటన్, రష్యా, కెనడా, ఇటలీ, శ్రీలంక, ఫ్రాన్స్, సింగపూర్, మలేసియా మొదలైన వివిధ దేశాల్లో 25 వేలకుపైగా కచేరీలను ఆయన నిర్వహించారు. సంస్కృతం, కన్నడ, తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, మలయాళం, పంజాబీ భాషల్లో ఆయన సంగీతాభిమానులను తన గానామృతంలో ఓలలాడించారు. విదేశీభాష ఫ్రెంచి లోనూ ఆయన తన గాత్రాన్ని అందించడం విశేషం.
విజయవాడలోని సంగీత కళాశాలకు ఆయన మొదటి ప్రిన్సిపాల్ గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో, శృంగేరీ పీఠంలో ఆస్థాన విద్వాంసుడిగా ఆయన కృషి శ్లాఘనీయం.
సంగీతంతోనే కాకుండా తన నటనతోనూ మెప్పించారు బాలమురళి. 1967లో ‘భక్త ప్రహ్లాద’ సినిమాలో నారదుడిగా నటించి, ఎస్వీరంగారావుకు ధీటుగా నటించాడన్న ప్రశంసలందుకున్నారు. “త్యాగయ్య’ అనే తమిళ స్టేజీ నాటకంలో నటించడంతో పాటు ఆ నాటకంలో పాడారు.
సంగీత కళా శిఖామణి, సంగీత విరించి, గాన కళాభూషణ, గాంధర్వ గాన సామ్రాట్, సంగీత కళా సరస్వతి, గాన కౌస్తుభ, గాన గంధర్వ, గాయక శిఖామణి, జ్ఞానశిఖామణి, జ్ఞాన చక్రవర్తి మొదలైన బిరుదులను వివిధ సంస్థలు ఆయనకు అందజేశాయి. మద్రాసు మ్యూజిక్ అకాడమీ ఆయనను ‘సంగీత కళానిధి’ అనే అవార్డుతో గౌరవించింది. సంగీత నాటక అకాడమీ ఆయనకు 1975లో పురస్కార ప్రదానం చేసింది.
పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ బిరుదులతో కేంద్ర ప్రభుత్వం బాలమురళీకృష్ణను గౌరవించింది. వివిధ విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. ఫ్రాన్స్ ప్రభుత్వం కూడా 2005లో ‘షెవలియర్ ఆఫ్ ద ఆర్డర్ డెస్ ఆర్ట్స్ ఎట్ డెస్ లెటర్స్’ పురస్కారంతో గౌరవించింది. యునెస్కో సంస్థ మహాత్మాగాంధీ సిల్వర్ మెడల్ తో 1995లో సన్మానించింది.
అకాడమీలను రద్దు చేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తీసుకున్న నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకించారు బాలమురళీకృష్ణ. రద్దు నిర్ణయం పట్ల నిరసనగా రాష్ట్రంలో ఎన్నడూ పాడనని శపథం చేశారు. లక్ష్మీపార్వతితో పాటు అప్పటి సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్న నేటి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి కృషి వల్ల తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారు. అనంతరం బాలమురళీకృష్ణకు ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో స్వయంగా ఘన సన్మానం చేశారు.
ఛలోక్తులు విసరడంలోనూ బాలమురళీకృష్ణ దిట్ట. ప్రముఖ మృదంగ విద్వాంసుడు టి.వి.గోపాలకృష్ణన్ గాత్ర కచేరీలు కూడా నిర్వహించారు. ఆయనపై బాలమురళి అభిప్రాయాన్ని ఎవరో అడిగారట. దానికి బాలమురళి సమాధానం “అతను మృదంగం వాయిస్తున్నప్పుడు ప్రధాన గాయకుడిగానూ, పాడుతున్నప్పుడు పక్క వాయిద్యగాడిలాగానూ ప్రవర్తిస్తాడు” అని.
సంగీత ప్రపంచానికి విశేష సేవలందించిన బాలమురళీకృష్ణ గత సంవత్సరం నవంబరు 22న కన్నుమూయడం ఎవరూ తీర్చలేని లోటు. అన్ని గమకాలనూ సమర్థవంతంగా పాడి, కర్ణాటక సంగీత పరిధిని విస్తృతం చేసిన కళామతల్లి ముద్దుబిడ్డ బాలమురళీకృష్ణ. గాన గంధర్వుడిగా, వాద్యకారుడిగా, స్వర మాంత్రికుడిగా, స్వరకర్తగా, నటుడిగా విశేష కృషి చేసిన మంగళంపల్లి సేవలు సంగీతం ఉన్నంతకాలం నిలిచి ఉంటాయి.


Sunday 2 July 2017

అన్వయ దోషం


మొన్న లంచ్ బెల్లు తర్వాత మొదటి పీరియడ్ బెల్లు కాగానే ఏడో తరగతి చదివే ఒక విద్యార్థి దగ్గరికొచ్చాడు. విషయమడిగితే "మా అమ్మ మా నాన్న చచ్చిపోయిండని చెప్పింది సార్" అన్నాడు. ఏడుస్తున్న ఆ విద్యార్థిని అనునయించాను. ఇంటికి పంపించాను. తీరా వేరే పిల్లలని అడిగితే చనిపోయింది ఆ విద్యార్థి తండ్రి కాదని, తాత అని తెలిసింది. అప్పుడు అతను చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకున్నా. తేలిందేంటంటే "మా నాన్న చనిపోయాడు" అని ఆ విద్యార్ధి తల్లి చెప్పింది అతనితో. పరోక్ష కథన పద్ధతి ఆ విద్యార్థికి తెలియకపోవడంతో నేను తప్పుగా అర్థం చేసుకున్నా.
ఇంతకీ దోషం ఎవరిది? అతను చెప్పిన వాక్యాన్ని అర్థం చేసుకోలేని నాదా? అన్వయ దోషంతో చెప్పిన ఆ విద్యార్థిదా?

ఈసురోమని పంతుళ్లుంటే దేశమేగతి బాగుపడునోయ్?


రేపటి దేశ భవిష్యత్తు నేటి బాలలదే అంటాం. బాలలను తీర్చి దిద్దే మహత్తర బాధ్యతను భుజస్కంధాలపై వేసుకునే ఉపాధ్యాయుల పాత్ర దేశ భవిష్యత్ రీత్యా అత్యంత ప్రధానమైనది. అలాంటి ఒక ఉపాధ్యాయుడు ఇంటర్వ్యూలో పాల్గొన్న సన్నివేశం ఆధారంగా ఒక చక్కటి వ్యాసం అందజేశారు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ సభ్యులు మన్మథ రెడ్డి గారు. విద్యావ్యవస్థలో ప్రమాణాలకు కారణమయ్యే  ఉపాధ్యాయుల అవగాహనలేమి క్షంతవ్యం కాదు. విద్యాశాఖలో సీనియర్ అధికారిగా అనుభవం గడించిన మన్మథరెడ్డి గారి వ్యాసం ఈ రోజు (02.07.2017)  'నమస్తే తెలంగాణ' దినపత్రిక లో ప్రచురితం.