Saturday 15 May 2021

బాలరాజు నుండి కలైడోస్కోప్ దాకా..

 


‘కంచి రాజధానిగా పాలించాడు.. ఇది మంచి రేవు పట్నంగా కట్టించాడు’ అని పల్లవ రాజుల పాలనను, మహాబలిపురాన్ని, కాంచీపురాన్ని ప్రస్తావించే పాట మీకు గుర్తుండే ఉంటుంది. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘బాలరాజు కథ’ సినిమాలోని పాట ఇది.

అసలు కంచి.. కాంచీపురం.. ఈ పేర్లు వినగానే మీకేం గుర్తొస్తుంది?
కొందరికి దేవాలయాలు, మరి కొందరికి పట్టు చీరలు.
కొందరికి శక్తి పీఠం, కొందరికి కామ కోటి పీఠం.
కొందరికి ఆధ్యాత్మిక విద్యా కేంద్రం, కొందరికి ఆధునిక విద్యా కేంద్రం.
కొందరికి కామాక్షి, కొందరికి ఏకాంబరేశ్వరుడు.
కొందరికి ఆది శంకరాచార్యులు, కొందరికి రామనుజాచార్యులు.
కొందరికి పల్లవుల రాజధాని, కొందరికి బంగారు బల్లి నిలయం.
తమిళనాడులోని జిల్లా కేంద్రం కాంచీపురానికి ఎన్నో ప్రత్యేకతలు. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా, వాణిజ్యపరంగా ప్రఖ్యాతి చెందిన పట్టణమిది. హైందవులకే కాకుండా జైనులకు, బౌద్ధులకు కూడా ఇది తీర్థ యాత్రా స్థలం.

‘అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా - పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయికాః’ అన్నారు. అంటే దేశంలోని సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి అన్నమాట. పంచభూత క్షేత్రాలలో ఇక్కడి ఏకాంబరేశ్వర దేవాలయం ఒకటి. ఇక్కడి కామాక్షి దేవాలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. పల్లవులు రాజధానిగా చేసుకుని పాలించిన ఈ పట్టణం మోక్షవిద్యకు, అద్వైతవిద్యకు ఇది మూలపీఠం. ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠం ఇక్కడిదే. క్రీ. పూ. రెండో శతాబ్దంలో పతంజలి రాసిన మహాభాష్యాలలో కూడా కంచి ప్రస్తావన ఉంది. బుద్ధుడు ఈ పట్టణాన్ని సందర్శించాడు. చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ కూడా కాంచీపురాన్ని సందర్శించాడు. ఎన్నో దేవాలయాలకు నిలయమిది. కామాక్షి, ఏకాంబరేశ్వర, వరదరాజ పెరుమాళ్ తదితర దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇతర ఏ క్షేత్రంలోనూ లేని మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ క్షేత్రంలోని బంగారు బల్లిని స్పృశించిన వారిని నమస్కరించినా బల్లిపాటు వల్ల కలిగే అనార్థాలు దరి చేరవన్న నమ్మకం ఉంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని సందర్శించినవారు కూడా వందనీయులే!

సరే .. కంచి పట్టు చీరల ప్రత్యేకత మనలో చాలామందికి తెలుసు. ఈ పట్టణంలో సుమారు ఐదు వేల కుటుంబాలవారు చేనేత వృత్తిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు.

కంచిలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే కాంచీపురం ఇడ్లీ.
కావలసిన పదార్థాలు:
మినపపప్పు- 1 గ్లాసు, ఉప్పుడు బియ్యం- 1 గ్లాసు, ఇడ్లీ బియ్యం- 1 గ్లాసు, నెయ్యి- తగినంత, నూనె- తగినంత, ఉప్పు-తగినంత, కరివేపాకు, పచ్చిమిర్చి-1 లేదా 2, ఇంగువ- సగం టీ స్పూన్, ఆవాలు- సగం టీ స్పూన్, కాజు- అవసరమైనన్ని , జీలకర్ర పొడి- సగం టీ స్పూన్, మిరియాల పొడి - సగం టీ స్పూన్, శొంఠి పొడి - సగం టీ స్పూన్, అల్లం- తరిగిన 3 చిన్న ముక్కలు

చేసే పద్ధతి:
1. ముందుగా మినపప్పు, ఉప్పుడు బియ్యం, ఇడ్లీ బియ్యం- మూడూ సమాన పరిమాణాల్లో తీసుకోవాలి. మూడు గంటలపాటు నీళ్లలో నానబెట్టాలి.
2. మూడు గంటల తర్వాత ఈ మూడింటిని గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్తం గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 8 గంటల పాటు పులియబెట్టాలి.
3. ఎనిమిది గంటల తర్వాత ఈ మిశ్రమానికి అవసరమైనంత ఉప్పు కలపాలి.
4. తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి ని వేసి, కాజు (జీడిపప్పు)ను వేయించుకోవాలి. ఈ వేయించిన కాజును మిశ్రమంలో కలుపుకోవాలి.
5. తర్వాత కొద్ది నూనెలో ఆవాలు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాల పొడి, శొంఠి పొడి, ఇంగువ వేయాలి. కొద్ది సేపు వేయించాలి. ఇది చల్లారిన తర్వాత మిశ్రమంలో కలపాలి.
6. ఇడ్లీ పాత్రలో ముందుగా నీళ్లు తగినన్ని పోసుకోవాలి. నీటి పైన మనం మామూలుగా ఇడ్లీలు చేసుకునే పాత్రను పెట్టాలి.
7. చిన్న చిన్న గిన్నెలు లేదా గ్లాసులకు నెయ్యిని/ నూనెను రాయాలి. వాటిలో సగ భాగం పిండి వేసుకోవాలి. ఈ గిన్నెలు లేదా గ్లాసులు ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టాలి.
8. అరటి ఆకులు మొదలైనవి కూడా గిన్నెలు, గ్లాసుల్లో పెట్టి; వాటిలో పిండి వేయవచ్చు. అయితే ఆకులు పెడితే నూనె, నెయ్యి రాయాల్సిన అవసరం లేదు.
9. ఇప్పుడు 25, 30 నిముషాలు ఆవిరిపై ఉడికించిన తర్వాత దించేయాలి.
10. గిన్నెలు, గ్లాసుల నుండి ఇడ్లీ వేరు చేసిన తర్వాత వాటిని చిన్న పరిమాణంలోకి కట్ చేసుకోవాలి.
11. ఇప్పుడు వేడి వేడి కాంచీపురం ఇడ్లీ రెడీ. దీన్ని సాంబారుతో గానీ టమాట చట్నీతో గానీ లాగిస్తే మరోసారి కాంచీపురాన్ని మర్చిపోరు.

‘పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి’ లోకోక్తికి వ్యతిరేక ఉదాహరణగా నిలిచి, మీ ఇంట్లోని అన్ని జిహ్వల చాపల్యాన్ని తీరుస్తుంది ఈ కాంచీపురం ఇడ్లీ.

నా బాల్యంలో కలైడోస్కోప్ లో సినిమారీళ్ల ముక్కలు పెట్టి చూపించేవారు. ఆ సందర్భంలో కలైడోస్కోప్ తిప్పే అతను రీళ్లను మారుస్తూ పాడిన మరో పాట లీలగా గుర్తొస్తోంది.. ‘కంచిపట్నం చూడర బాబూ చూడర బాబూ..’ (బహుశా అతను ‘కాశీపట్నం చూడర బాబు..’ పాటను అనుకరించాడేమో!)