Friday 21 April 2017

సంస్థ ప్రగతిలో ప్రజాసంబంధాలు కీలకం (ఏప్రిల్ 21న జాతీయ ప్రజాసంబంధాల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం)



సంస్థ ప్రగతిలో ప్రజాసంబంధాలు కీలకం
-   డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు
9441046839
ఏ సంస్థ అయినా ప్రగతి బాటలో పయనించాలంటే ఆ సంస్థపై ప్రజలకు సదభిప్రాయం ఉండాలి. ప్రజాభిప్రాయం సానుకూలంగా ఉంటే ఎంత చిన్న సంస్థ అయినా ఉన్నత శిఖరాలధిరోహిస్తుంది. వ్యతిరేక ప్రజాభిప్రాయం ఆ సంస్థను అధఃపాతాళానికి తొక్కేస్తుంది. ప్రజాభిప్రాయం సానుకూలంగా మలచడంలో ప్రధానపాత్ర పోషించేది ప్రజాసంబంధ రంగం. అందుకే సంస్థ మనుగడకు, అభివృద్ధికి ఆయువుపట్టు ప్రజాసంబంధాల పెంపుదల. ఈ దిశగా కృషి చేయడమే ప్రజాసంబంధ విభాగం ప్రధాన విధి.
ప్రజాసంబంధ విభాగం గతంలోలాగా వేదిక వెనుక పనిచేసే యంత్రాంగంగా ఉండడానికే పరిమితం కావడం లేదు. ప్రభుత్వ రంగంలో అయినా, ప్రైవేటు రంగంలో అయినా సంస్థకు చెందిన ముఖ్యమైన అంశాలను వెల్లడి చేయడంలో ప్రజాసంబంధాల అధికారులు కీలక పాత్ర పోషిస్తూ మన్ననలు అందుకుంటున్నారు. ప్రజాసంబంధాల ప్రాధాన్యతను యాజమాన్యాలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాయి. గత రెండు దశాబ్దాలలో వచ్చిన మార్పు ఇది. చాలా సంస్థలు ప్రత్యేకంగా ప్రజాసంబంధాల అధికారులను నియమిస్తున్నాయి. కొన్ని సంస్థలు ఇది చాలా ముఖ్యమైన బాధ్యత కాబట్టి ఉన్నతాధికారులకు అదనపు బాధ్యతగా అప్పజెప్తున్నాయి.
పారిశ్రామికీకరణ బాగా పుంజుకున్న ప్రస్తుత తరుణంలో సంస్థ మనుగడ కోసం నిరంతరం పోరాటం చేయాల్సి ఉంటుంది. అన్ని రంగాల్లోనూ పోటీ నెలకొన్న దృష్ట్యా సంస్థ ఉత్పత్తులను, సేవలను విస్తృతంగా ప్రచారం చేయవలసి ఉంటుంది. ఇతర సంస్థలతో పోటాపోటీగా ప్రజల్లో సానుకూల అభిప్రాయాన్ని మూటగట్టాల్సి ఉంటుంది. ప్రజాసంబంధాల అధికారులు ఈ విధిని అత్యంత సమర్థతతో, సాపేక్షంగా తక్కువ ఖర్చుతో చేయవలసి ఉంటుంది. సంస్థకు మంచి పేరును తేవడమే కాకుండా బడ్జెట్ పరంగా భారం అధికంగా ఉండకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
ప్రజాభిప్రాయ సాధన కోసం ప్రజాసంబంధ విభాగం చేసే పని ఎప్పుడూ ప్రణాళికాబద్ధంగా ఉండాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఈ మధ్య ఒక కార్పొరేట్ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు వచ్చాయి. ప్రసార మాధ్యమాల్లో వ్యతిరేక ప్రచారం అధికంగా జరిగింది. ఇలాంటి సందర్భాల్లో ప్రజాసంబంధాల అధికారి అత్యంత కీలక పాత్ర పోషించవలసి ఉంటుంది. సానుకూలత పెంపొందించేందుకు ఏయే మార్గాలు అవలంబించాలనే విషయంలో ప్రణాళికను రూపొందించుకుని, దానికి అనుగుణంగా పావులు కదపాల్సి ఉంటుంది.
బ్యాంకింగ్ రంగంలో ఈ మధ్య అనేక మార్పులొచ్చాయి. పెద్ద నోట్ల రద్దు, అసోసియేట్ బ్యాంకుల విలీనం వంటి అంశాలపై ప్రజాభిప్రాయం విభిన్నంగా ఉంటుంది. అదే సమయంలో ఎ.టి.ఎం.కేంద్రాలలో డబ్బుల కొరత, మూసివేత; బ్యాంకుల సేవలకు అదనపు ఛార్జీల వడ్డన వంటివాటిపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో బ్యాంకింగ్ పి.ఆర్.చేసే పని ఆయా అంశాల్లోని విభిన్న కోణాలను ప్రజల ముందుకు తీసుకురావడం, ఎ.టి.ఎం. కేంద్రాల్లో డబ్బుల కొరతకు కారణాలను తెలియజెప్పడం, అదనపు ఛార్జీల వల్ల మరింత మెరుగైన సేవలను ఏ విధంగా కల్పిస్తామనే విషయాన్ని సమర్థవంతంగా ప్రచారం చేయడం.
గతంలో ఒక సందర్భంలో కోళ్లు తినకూడదనే ప్రచారం విస్తృతంగా జరిగింది. కోళ్లను తినడం వల్ల వ్యాధులు ప్రబలుతాయన్న వదంతులు ప్రచారమయ్యాయి. దీనివల్ల కోళ్ల పరిశ్రమకు నష్టాలొచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో ప్రజాసంబంధాల విభాగం చేసిన ప్రచారం వల్ల పరిస్థితి అదుపులోకి వచ్చింది. ముఖ్యమైన హోదాల్లో ఉన్నవారు కోడి మాంసాన్ని బహిరంగంగా సామూహిక భోజనాల్లో భుజించడం వంటి కార్యక్రమాల రూపకల్పన ద్వారా పరిస్థితిని నెమ్మదిగా మార్చగలగడం ప్రజాసంబంధ విభాగం చేసిన పని.
గతంలో ఒక ఆహార ఉత్పత్తుల సంస్థ ఉత్పత్తుల విషయంలో కూడా వ్యతిరేక ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా మార్చగలిగింది ప్రజాసంబంధాల విభాగం చేపట్టిన చర్యలే.
ప్రజాసంబంధాల విభాగం చేసే పనుల వాళ్ళ కొన్ని సంస్థలకు బ్రాండ్ ఇమేజీ పెరుగుతుంది. తద్వారా సంస్థ ఆర్థికంగా పరిపుష్టమవుతుంది. ఉత్పత్తుల అమ్మకం సమయంలోనే కాకుండా ఉత్పత్తుల తయారీ దశలో కూడా సానుకూల ప్రచారం వల్ల పెట్టుబడులను భారీగా సమీకరించుకునేందుకు అవకాశాలు ఏర్పడతాయి. ఈ దశలోనే ప్రజాభిమానం చూరగొనే సంస్థలకు ఆర్ధిక సంస్థల రుణాలు లభించడం  సులువు. షేర్ల ద్వారా కూడా పెట్టుబడికి అవసరమైన మూలధనాన్ని సమీకరించుకోవచ్చు.
ప్రజాసంబంధాల విభాగం అనేక పద్ధతుల ద్వారా సంస్థకు మంచి పేరు సాధించిపెడుతుంది. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, హోర్డింగులు, బ్రోచర్లు, రేడియో, టి.వి., క్యాలెండర్లు, డైరీలు, అంతర్గత ప్రచురణలు, ఎగ్జిబిషన్లు వంటివాటి ద్వారా ప్రచారం నిర్వహిస్తుండడం సాధారణం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రజాసంబంధాల విభాగం సమర్థవంతంగా ఉపయోగించుకుంటోంది. ఇ-మెయిల్, ఫేస్ బుక్, వాట్సప్, ట్విట్టర్, గూగుల్ యాడ్స్, వెబ్ సైట్స్ మొదలైన వాటి ద్వారా కూడా ఆధునిక ప్రజసంబంధ విభాగం ప్రచారం నిర్వహిస్తోంది. ఉత్పత్తులు, సేవల వ్యాప్తి కోసం పలు ఈవెంట్లను నిర్వహించడం కూడా ఈ కాలంలో కనబడుతోంది. డీలర్లు, సప్లయర్లు, ముఖ్యమైన కస్టమర్లను సంస్థకు ఆహ్వానించి, వారితో సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలను సేకరించడం; సామాజిక ఉత్సవాల నిర్వహణ మొదలైన పనులను కూడా ప్రజాసంబంధాల విభాగాలు నిర్వహిస్తున్నాయి.
ప్రజాసంబంధాల విభాగం వివిధ విధానాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటుంది, విశ్లేషిస్తుంది, వ్యాఖ్యానిస్తుంది. ఆ ప్రజాభిప్రాయం మేరకు సంస్థ పనితీరులో రావాల్సిన మార్పుపై వివిధ స్థాయిల్లో యాజమాన్యంతో చర్చిస్తుంది. సంస్థ విధానాలకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని సానుకూలంగా మార్చడానికి సంబంధించిన ప్రణాళికలను రూపొందిస్తుంది.  పరిశోధనలను నిర్వహిస్తుంది. నిరంతరం కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన, అమలు బాధ్యతను చేపడుతుంది. ఈ దిశగా వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటుంది.  
ప్రజాసంబంధ అధికారి మనో విజ్ఞాన శాస్త్రం, సామాజిక శాస్త్రం, మేనేజిమెంట్ మొదలైన అనేక అంశాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆయా అంశాలపై సాధికారత, పట్టు ఉంటేనే సమర్థవంతంగా విధుల నిర్వహణ సాధ్యం. ఇంతటి కీలకమైన విభాగం కావడంవల్లే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రజసంబంధ విభాగానికి ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తున్నాయి.  
(ఏప్రిల్ 21న జాతీయ ప్రజాసంబంధాల దినోత్సవం)
(ఈ వ్యాస రచయిత ప్రజాసంబంధాలలో విశ్వవిద్యాలయ స్వర్ణపతక గ్రహీత)



Wednesday 5 April 2017

బాబు జగ్జీవన్ బాటలో..



బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా ఈరోజు (05.04.2017) 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా వ్యాసం
http://epaper.ntnews.com/c/18074259

గొప్ప ప్రజాస్వామిక వాది జగ్జీవన్ రాం

బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా 'మన తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో 05.04.2017 నాడు ప్రచురితమైన నా వ్యాసం





















http://epaper.manatelangana.news/c/18073501

Sunday 2 April 2017

బ్యాంకుల విలీనం- లాభనష్టాలు (నమస్తే తెలంగాణ, 02.04.2017)

'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో 02.04.2017 నాడు ప్రచురితమైన నా వ్యాసం. 

అసమానతలను పెంచే ప్రయోగం (ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిట్ పేజీ, 01.04.2017)

ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిట్ పేజీలో 01.04.2017 నాడు ప్రచురితమైన నా వ్యాసం.