Monday 28 August 2017

అభాగ్యజీవులు - అస్తిత్వాల గ్రంథం (పుస్తక సమీక్ష)


విరసం ప్రచురించిన 'అభాగ్య జీవులు' గ్రంథంపై నేను రాసిన సమీక్ష- 28.08.2017 'మన తెలంగాణ' దినపత్రిక  సాహిత్య అనుబంధం 'కలం'లో ప్రచురితం 

Friday 25 August 2017

బహుముఖ ప్రజ్ఞాశాలి దేవులపల్లి

తెలంగాణ వైతాళికులు దేవులపల్లి రామానుజ రావు గారిపై నేను రాసిన వ్యాసం నేటి 'మన తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం.

(25.08.2017, 'మన తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీ)




http://epaper.manatelangana.news/c/21602820

Monday 7 August 2017

సాహితీ భీష్ముడి అస్తమయం తీరని లోటు


తొమ్మిది దశాబ్దాల ప్రాయం దాటి రెండేళ్లు గడుస్తున్నా అలుపెరుగక నిరంతర సాహితీ ప్రయాణం చేస్తూ వచ్చిన డాక్టర్ పోతుకూచి సాంబశివరావు గారు అస్తమించడం బాధాకరం. ఆయన అస్తమయంతో తెలుగు సాహితీలోకం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఆయన ప్రముఖ రచయిత, కవి, న్యాయవాది, సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు, సంపాదకులు. ఆంధ్ర విశ్వవిద్యాలయ ‘కళాప్రపూర్ణ’ బిరుదాంకితులు.
వారితో నాకు దాదాపు 30 సంవత్సరాల క్రితం పరిచయం. నేను రాసిన కవిత్వాన్ని ప్రచురణ రూపంలోకి తెచ్చి ఒక గుర్తింపు ఇచ్చిన వారు పోతుకూచి సాంబశివరావు. చిన్నా పెద్దా తేడా లేకుండా అరమరికల్లేకుండా అందరితో కలిసిపోయే మనస్తత్వం వారిది. పెద్దవాళ్లతో ఎలా జోకులేస్తారో చిన్నవాళ్లతో కూడా అలాగే కులాసాగా ఉండేవారు.
పోతుకూచి గారు అవివాహితులు. 1990 దశకంలో నేను అప్పుడప్పుడూ వారి ‘విశ్వరచన’, ‘యూనిలిట్’ పత్రికల ఎడిటింగ్ పని చూసేవాడిని. అప్పుడే అడిగాను “మీరు పెళ్ళి ఎందుకు చేసుకోలేద”ని. దానికి ఆయన తమాషా సమాధానం “నాకు వంట వచ్చు. ఇక పెళ్ళితో పనేముంది” అని.  పెళ్ళికి దూరంగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఆయన ఎంతో మందికి పెళ్ళి సంబంధాలు కుదిర్చారు. ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఒక కళ్యాణ వేదిక కూడా నిర్వహించారు. ఆ సందర్భంలో ఎవరో ఒక సంబంధం కోసం వారి ఆఫీస్ కి వచ్చారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. వారికి ఏదో సంబంధం గురించి చెప్తున్నారు. వారడిగిన ప్రశ్న ఆ వరుడి ఎత్తు ఎంత అని. నన్ను ఉదాహరణగా చూపాలనుకుని నా ఎత్తెంతో అడిగారు. తెలియదన్నా. “నీ ఎత్తు నీకు తెలియకపోతే ఎలాగయ్యా” అన్నారు.
పోతుకూచి గారికి మానవ సంబంధాలపై ఆసక్తి అమితం. ఎవరిని కలిసినా అపరిమితమైన ఆనందం వ్యక్తపర్చేవారు. వారితో తనకు ఉన్నఅనుబంధాన్ని వివరించేవారు. వారి చేయి పట్టుకుని గట్టిగా ఊపేసేవారు. వారి హస్త బంధనం నుండి విడివడడం కష్టం. పెద్ద పెద్ద వాళ్లతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని సందర్భాన్ని బట్టి చెప్పేవారు. ఎవరు ఫోన్ చేసినా ఇంటికి రమ్మనేవారు. కలవాలనే ఆసక్తి వ్యక్తం చేసేవారు.
నాకు జీవితంలో ఆర్ధిక విషయంలో జరిగిన మోసం గురించి, దానివల్ల నేను పడుతున్న ఇబ్బందులను గురించి ఈమధ్య ఆయనను కలిసినపుడు చెప్పాను. “అలాంటి వాళ్లని కాల్చిపారేయాలయ్యా” అన్నారు. నాకు ధైర్యం చెప్పారు.
ఆయన ఆరోగ్య రహస్యం అడిగాను. వెంటనే “ఆయుర్వేదం” అన్నారు. ఆయుర్వేద మందులను తానే నూరుకునేవారు కూడా. తన వంట తానే చేసుకునేవారు. “ఒంటరిగా ఉండడం ఇబ్బందిగా లేదా సార్” అని అడిగాను. “పుస్తకాలు నా నేస్తాలు. ఇక నేను ఒంటరిని ఎలా అవుతాను” అన్నారు. నిజమే పుస్తకాలు ఆయనకు అత్యంత ఇష్టమైన నేస్తాలు. పుస్తకాలు చదవడం ఆయనకు చాలా ఇష్టం. బహుమతిగా కూడా పుస్తకాలే ఇచ్చేవారు. అప్పట్లో న్యూ బోయిగూడలో ఆయన నివాసం నిండా పుస్తకాలే ఉండేవి. ఇప్పుడు కవాడీగూడా నివాసంలోనూ అంతే.
“ఈ వయసులో వంట చేయడం ఇబ్బంది కదా” అన్నాను- వంట మనిషినైనా పెట్టుకుంటే బాగుండేదన్న ఆలోచనతో. నవ్వారు. “వంట చేయడం ఏమన్నా ఘన కార్యమా” అని ప్రశ్నించారు.  తాను వంట ఎలా చేసుకుంటారో వివరించారు.
ఒక సందర్భంలో స్వీట్ షాప్ నుండి ఫోన్ చేశాను. “మీకిష్టమైన స్వీట్ ఏంటో చెప్పండి సార్’ అని. ఏదైనా పర్వాలేదన్నారు. ఆశ్చర్యపోయాను. ఆ వయసులో నిజానికి చాలామంది స్వీట్లకు దూరంగా ఉంటారు కదా అని. ఆయన ఆరోగ్యం అలాంటిది.
మా గురువు డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ గారి బాల్యంలో పాఠశాల వార్షికోత్సవంలో ఉపాధ్యాయులందరూ కలిసి పోతుకూచి గారు రాసిన ‘ఏడు సున్నాలు’ అనే నాటకాన్ని ప్రదర్శించారు. “ఆ రోజుల్లో సినిమా థియేటర్ లేని నారాయణఖేడ్ కి అదే పెద్ద సినిమా” అని నేను నా సిద్ధాంత గ్రంథం ‘అమ్మంగి వేణుగోపాల్ రచనలు- సమగ్ర పరిశీలన’ లో రాశాను. ఈ విషయాన్ని పోతుకూచి గారితో ఈ మధ్య ఆ గ్రంథాన్ని ఇస్తూ ప్రస్తావించాను. చాలా సంతోషపడ్డారు.
ఇటీవల ఆచార్య సి.నారాయణ రెడ్డి గారి అంత్యక్రియల సందర్భంలో వారి భౌతిక కాయాన్ని సందర్శించేందుకు వచ్చారు సాంబశివరావు గారు. తెలంగాణ సారస్వత పరిషత్తు హాలు నిండా జనం. మెట్ల మార్గానికి అడ్డంగా కుర్చీవేసి ఆయనను ఎవరో కూర్చుండబెట్టారు. మెట్ల మార్గం గుండా నారాయణరెడ్డి గారి భౌతిక కాయాన్ని సందర్శించేందుకు జనం తోపులాట. సాంబశివరావు గారు కూర్చున్న కుర్చీపై పడబోతున్న వారిని ఒక చేత్తో అడ్డుకుని మరో చేత్తో ఆయనను నెమ్మదిగా పైకి లేపాను. పక్కకి తీసుకొచ్చి సురక్షిత స్థానంలో కుర్చీవేసి కూర్చుండపెట్టాను. ఆయన కళ్లలో ధన్యవాదపూర్వకంగా మెరుపు. ఆరోగ్యం ఎలా ఉందని అడిగాను. “నాకేం!” అన్నారు- నిక్షేపంగా ఉన్నానని ఆయన భావం. కుర్చీలో కూర్చున్నా ఒక చేత్తో నన్ను పట్టుకున్నారు. అదే చివరిసారి వారిని చూడడం.
92 సంవత్సరాల వయస్సులోనూ తన పనులు తాను చేసుకోవడం, తన వంట తాను వండుకోవడం చేసేవారు ఆయన. మిత్రులకు స్వయంగా ఉత్తరాలు రాసేవారు. వివిధ సాహిత్య కార్యక్రమాల నిర్వహణా భారాన్ని తానే మోసేవారు. అందరికీ ఫోన్లు చేసి గుర్తుచేసేవారు. జ్యోతిష్యంలోనూ, ఆయుర్వేదంలోనూ ఆయనకు అభిరుచి ఉంది.
శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయ కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగా, ఆంధ్రప్రదేశ్ లలితకళా అకాడమీ సభ్యులుగా, ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర సలహాసంఘ సభ్యులుగా, ఆంధ్ర మహిళా సభ సాహిత్య నిర్వాహక మండలి సభ్యులుగా, కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యులుగా పోతుకూచి గారు సేవలందించారు. యునెస్కో సదస్సులో దక్షిణ భారత దేశ ప్రతినిధిగా పాల్గొన్నారు. అఖిల భారత తెలుగు రచయితల మహాసభలను నిర్వహించారు. నవ్య సాహితీ సమితి, విశ్వసాహితి సంస్థలను స్థాపించి సాహిత్య సేవ చేశారు. ‘విశ్వ రచన’ తెలుగు పత్రికకు, ‘యూనిలిట్’ ఆంగ్ల పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఆయన నటులు కూడా.
వివిధ పత్రికల్లో ఆయన అనేక వ్యాసాలు రాశారు. ఆంగ్లం, హిందీ, కన్నడ భాషలలోని రచనలను అనువదించి, తెలుగులోకి తెచ్చారు. ‘రాసి-సిరా’, ‘పోతుకూచీయం’, ‘అగ్నినాదాలు’ మొదలైన పదికిపైగా కవితాసంపుటాలను వెలువరించారు. ‘హంతకులు’, ‘పల్లె కదిలింది’, ‘అద్దె కొంపలో ఒక నెల’, ‘చుట్టాల రభస’ మొదలైన పలు నాటకాలు, నాటికలు రచించారు. ‘అన్వేషణ’, ‘ఉదయ కిరణాలు’, ‘చలమయ్య షష్టిపూర్తి’ మొదలైన ఐదు నవలలు రాశారు. ‘నవ కదంబం’, ‘బ్రతుకుల పతనం’, ‘సాంబశివరావు కథలు’ మొదలైన కథాసంపుటాలను వెలువరించారు. మూడు వందలకు పైగా కథలు రాశారు. ఆయన రచించిన పలు కథలు హిందీ, కన్నడ, తమిళం, రష్యన్, జర్మన్, ఆంగ్ల భాషల్లోకి అనువదించబడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జీవిత చరిత్రను ‘సంజీవయ్య సందర్శనం’గా వెలువరించారు. షిర్డీ సాయిబాబా జీవిత చరిత్రను కూడా ఆయన రచించారు. తన ఆత్మ  కథ తొలిభాగాన్ని ఈనెల 2న ఆవిష్కరించారు.

‘సాహితీ భీష్మ’ డాక్టర్ సాంబశివరావు గారి మరణం తెలుగు సాహిత్యరంగానికి తీరని లోటు. 

Sunday 6 August 2017

జాతీయ విజ్ఞాన కమిషన్ సూచనలు (డాక్టర్ పి.ఎం.భార్గవ గారి మృతి సందర్భంగా)

 ఇటీవల మరణించిన ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పుష్పమిత్ర భార్గవ గారికి విద్యారంగంపై సమగ్ర అవగాహన ఉంది. ఉమ్మడి పాఠశాల వ్యవస్థ మొదలైన అంశాల్లో ఆయన ఆలోచనా ధోరణి శ్లాఘనీయం. జాతీయ విజ్ఞాన కమిషన్ ఉపాధ్యక్షుడిగా ఉంటూనే వివిధ అంశాల్లో కమిషన్ అభిప్రాయాలతో విభేదించారు. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ దశాబ్దం క్రితం నేను రాసిన వ్యాసం డాక్టర్ పుష్పమిత్ర భార్గవ గారి మృతి సందర్భంగా ఇక్కడ షేర్ చేస్తున్నాను.





Wednesday 2 August 2017

ముగ్గురూ ముగ్గురే - శిఖర సమానులే




ముగ్గురూ ముగ్గురే

శిఖర సమానులే


ఒకే పక్ష కాలంలో మరణించిన ఆ ముగ్గురూ భారత దేశ విజ్ఞానశాస్త్ర ఖ్యాతిని అంతర్జాతీయంగా చాటిచెప్పారు. దేశానికి ప్రతినిధులుగా శాస్త్ర, సాంకేతిక, విద్యారంగాల్లో అసమాన ప్రతిభను ప్రదర్శించారు. భారత దేశ పౌర పురస్కారాలను అందుకున్న ఆ ముగ్గురు విశిష్ట సేవా మూర్తులు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన ఆచార్య ఉడుపి రామచంద్ర రావు,  విశ్వవిద్యాలయాల నిధుల సంస్థ అధ్యక్షుడిగా 
పనిచేసిన ఆచార్య యశ్ పాల్ సింగ్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థ వ్యవస్థాపక సంచాలకులుగా పనిచేసిన డాక్టర్ పుష్పమిత్ర భార్గవ.
వీరిలో ఆచార్య యు.ఆర్.రావు దక్షిణభారతదేశానికి, ఆచార్య యశ్ పాల్ ఉత్తర భారతదేశానికి చెందినవారు. డాక్టర్ పి.ఎం.భార్గవ ఉత్తర, దక్షిణ భారతాలు రెంటితోనూ అవినాభావ సంబంధాలున్నవారు. కర్నాటక రాష్ట్రంలోని అడమారులో ఆచార్య యు.ఆర్. రావు 1932 మార్చి 10న జన్మించారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న ఝాంగ్ లో 1926 నవంబరు 26న పుట్టారు ఆచార్య యశ్ పాల్. 1928 ఫిబ్రవరి 22 న రాజస్థాన్ లోని అజ్మీర్ లో జన్మించినా దక్షిణ భారతదేశంలోని హైదరాబాదులో స్థిరపడిపోయారు డాక్టర్ పి.ఎం.భార్గవ.

ఈ ముగ్గురిలో ఆచార్య యు.ఆర్.రావు, ఆచార్య యశ్ పాల్ భౌతిక శాస్త్రంలో డాక్టరేట్ గ్రహీతలు కాగా డాక్టర్ పి.ఎం.భార్గవ రసాయన శాస్త్రంలో పిహెచ్.డి. చేసి అనంతర కాలంలో జీవ శాస్త్రం వైపు అడుగులేశారు.
ఈ ముగ్గురూ పద్మభూషణ్ గ్రహీతలు కాగా డాక్టర్ పి.ఎం.భార్గవ ఆ పౌర పురస్కారాన్ని ప్రభుత్వ విధానాలకు నిరసనగా తిరిగి ఇచ్చేశారు. మిగతా ఇద్దరూ పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా పొందారు.
వీరు ముగ్గురూ విద్యారంగంలో అసమాన కృషి చేశారు. అహ్మదాబాద్ లోనూ అమెరికాలోనూ బోధనావృత్తి నిర్వర్తించారు యు.ఆర్.రావు. లక్నో లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థకు ఛాన్సలర్ గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ గా యశ్ పాల్ పనిచేశారు. విశ్వవిద్యాలయాల నిధుల సంఘానికి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. జాతీయ పాఠ్య ప్రణాళికా చట్ర రూపకల్పన కమిటీ అధ్యక్షునిగా, విద్యారంగ సంస్కరణల కమిటీ అధ్యక్షునిగా పనిచేశారు. డాక్టర్ పి.ఎం.భార్గవ మొదట్లో బోధనా వృత్తిలో పనిచేశారు. విద్యారంగంలో అనేక కీలక ప్రతిపాదనలు చేసిన జాతీయ విజ్ఞాన కమిషన్ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు.

భారత దేశ తొలి కృతిమ ఉపగ్రహం ఆర్యభట్టతో సహా 19 కృత్రిమ ఉపగ్రహాల ప్రయోగాలకు నాయకత్వం వహించారు ఆచార్య యు.ఆర్.రావు. ‘ప్రసార భారతి’ సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. దేశంలో టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆయనే కారణం. చదువుల భారాన్ని తగ్గించాలని కీలక సిఫారసు చేసిన కమిటీకి అధ్యక్షుడు యశ్ పాల్. ప్రణాళికాసంఘంతో సహా అనేక సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థను స్థాపించి వ్యవస్థాపక సంచాలకులుగా పనిచేశారు పి.ఎం.భార్గవ. మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా యశ్ పాల్, భార్గవ తీవ్రంగా కృషి చేశారు. మతపరమైన ఆచారాల్లో శాస్త్రీయత లేదని పేర్కొన్నారు యశ్ పాల్. భార్గవ అభిప్రాయమూ అదే. హైదరాబాద్ లో ఉబ్బసానికి ఇచ్చే చేప మందు శాస్త్రీయతని ప్రశ్నించారు భార్గవ. విశ్వవిద్యాలయాల్లో జ్యోతిష్యాన్ని ప్రవేశ పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేశారు. శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందింపజేసేందుకు ఆయన పోషించిన పాత్ర ప్రశంసనీయం. దేశంలో ఆధునిక జీవశాస్త్ర నిర్మాతగా ఆయన కీర్తి ఎప్పుడూ నిలిచి ఉంటుంది.
భారత వైజ్ఞానిక రంగానికి నిరుపమాన సేవ చేసిన ఈ ముగ్గురూ లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. 
                            -   డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్ రావు