Sunday 24 December 2017

కవిత్వ శిఖరం అటల్ బిహారీ


     - డాక్టర్ రాయారావు సూర్య ప్రకాశ్ రావు
(ఈ నెల 25న అటల్ బిహారీ వాజ్ పేయి 94వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం ) 

కవిత్వం నిరంతరాయంగా రాసే రాజకీయ నాయకులు అతి కొద్దిమందే. రాజకీయంలో తలమునకలై కొద్దిపాటి సమయం కూడా దొరకని ప్రధానమంత్రి పదవి నిర్వర్తిస్తూ కూడా కవిత్వం రాయగలగడం దాదాపు అసాధ్యం. అటల్ బిహారీ వాజ్ పేయి లాంటి వారికే అది సాధ్యమైంది.
దీర్ఘ కాలం పార్లమెంటులో సభ్యుడిగా ఉన్న అటల్ బిహారీ 1924 డిసెంబరు 25న గ్వాలియర్ లో జన్మించారు. ఆయన పితామహులు పండిట్ శ్యాంలాల్ వాజ్ పేయి గొప్ప సంస్కృత పండితులు. అటల్  తండ్రి పండిట్ కృష్ణ బిహారీ కవిగా సుప్రసిద్ధులు. ‘జయంతి ప్రతాప్’ అనే పత్రికలో ఆయన కవితలు ప్రచురితమయ్యాయి. కృష్ణ బిహారీ కవిగానే కాకుండా గొప్ప వక్తగా కూడా పేరుపొందారు. అటల్ పెద్దన్న పండిట్ అవధ్ బిహారీ వాజ్ పేయి కూడా కవిత్వం రచించేవారు.  ఇంట్లో ఉండే సాహిత్య వాతావరణం అటల్ ను కవిత్వం వైపు ప్రేరేపించింది.
కాన్పూరులోని డి.ఎ.వి. కళాశాల నుండి రాజనీతి శాస్త్రంలో ఎం.ఏ. ఉత్తీర్ణుడైన అటల్ ఎల్.ఎల్.బి. కోర్సులో చేరినా సంఘ్ కార్యకలాపాల వల్ల చదువు పూర్తి చేయలేకపోయారు. 1939లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో అటల్ స్వయంసేవకుడిగా చేరారు. 18 సంవత్సరాల వయస్సులో గాంధీజీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారు. ఆర్య సమాజ యువజన విభాగం ఆర్య కుమార్ సభకు 1944లో ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో ప్రచారకుడిగా పూర్తిస్థాయి కార్యకర్త అయ్యారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి విస్తారక్ గా నియమితులయ్యారు. అదే సమయంలో ‘రాష్ట్ర ధర్మ’ మాసపత్రిక, ‘పాంచజన్య’ వారపత్రికలతో పాటు ‘స్వదేశ్’, ‘వీర్ అర్జున్’ అనే దిన పత్రికల్లో కూడా పనిచేశారు.  1951లో భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుడయ్యారు.
1957లో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. ఇరవై ఏళ్ల పాటు భారతీయ జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా పనిచేశారు.  1996లో 11వ లోక్ సభకు ఎన్నికై ప్రధానమంత్రిగా 13 రోజులు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 1998లో పూర్తి మెజారిటీతో మళ్ళీ గెలిచి, ప్రధాన మంత్రిగా పూర్తి కాలం బాధ్యతలు నిర్వహించారు.
అటల్ బిహారీ అనేక అవార్డులు పొందారు. 1992లో పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. 1993లో కాన్పూరు విశ్వవిద్యాలయం నుండి డి.లిట్. పొందారు. 1994లో లోకమాన్య తిలక్ అవార్డు పొందారు. అదే సంవత్సరం ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు లభించింది. అదే ఏట గోబింద్ వల్లభ్ పంత్ అవార్డు పొందారు. 2015లో భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న పురస్కార గ్రహీత అయ్యారు.
రాజకీయ జీవితంలో తలమునకలైనా కవిత్వసాధనను విడిచి పెట్టని  గొప్ప కవి అటల్ జీ. ఆయన రచించిన మొదటి కవిత ‘తాజ్ మహల్’లో అభ్యుదయ వాదం కనబడుతుంది. వాజ్ పేయి అత్యున్నత శిఖరం అయినా సామాన్యుడి నుండి దూరం కావద్దని కోరుకున్నారు.
“హే ప్రభూ!
నాకు ఇంతటి ఎత్తు ఎప్పుడూ ఇవ్వకు
ఇతరులను గుండెలకు హత్తుకోనంతగా
అంతటి హృదయ కాఠీన్యాన్ని
ఎప్పుడూ నాకు ఇవ్వకు...”
ఇంతగా సామాన్యుడితో కలిసిపోవాలని కోరుకునే నాయకుడు ఎవరుంటారు? తనకు శిఖరాలు లభించకపోయినా పర్వాలేదు గానీ ఇతరుల నుండి దూరం చేయొద్దని మనసారా వాంఛ కనబరిచేవారు ఎవరన్నా ఉంటారా? శిఖర స్థాయి వద్దని కోరుకోడానికి కారణం కూడా తనే చెప్పారు వాజ్ పేయి.
“ఎత్తయిన పర్వతాలపై
చెట్లు ఎదగవు
మొక్కలు మొలకెత్తవు
గడ్డి పరక కూడా పరచుకోదు”
వాజ్ పేయి భావన వెనుక ఉన్న సునిశిత పరిశీలనకి ఉదాహరణ ఇది.  
“గాలి గోపురంలా ఒంటరిగా
తనవాళ్లకు దూరంగా
శూన్యంలో ఏకాకిగా మిగిలిపోవడం
పర్వతాల గొప్పదనం కానేకాదు
అది కేవలం నిస్సహాయత”
అందుకే ఆ నిస్సహాయత తనకు వద్దని ఆయన కోరుకుంటారు.
“రుతువులు ఏవైనా
వసంతం కానీ హేమంతం కానీ
కేవలం ఎత్తుగా ఎదగడమే అయితే
నిశ్శబ్దంగా ఒంటరిగా మిగిలిపోవడమే!”
అలా ఒంటరిగా మిగిలిపోయేవాడు సమూహానికి దూరమవుతాడు. అందుకే శిఖరం కావద్దని కోరుకుంటారు వాజ్ పేయి.
ఎమర్జెన్సీలో జైలు పాలైన సందర్భంలో వాజ్ పేయి రాసిన కవితలో
“చీకటి రాత్రి
విసిరిన సవాలు ఇది
కిరణమే చివరి అస్త్రమవుతుంది”
అంటూ అప్పటి ప్రభుత్వానికి సవాలు విసిరారు.
“తలవంచడం
మాకు సమ్మతం కాదు
పందెంలో అన్నీ ఒడ్డి నిలబడ్డాం
నేలకొరుగుతాం కానీ తలవంచం”
అంటూ లక్ష్య సాధన పట్ల తనకుండే నిబద్ధతను కవిత్వీకరించారు వాజ్ పేయి.
అదే సందర్భంలో రాసిన మరో కవితలో
“జైలులో ఉన్న కవి మనస్సులో ఒక ఆలోచన మెరిసింది
ఏ వ్యక్తి కూడా జీవితంలో నిరాశ చెందరాదని
నిషా వక్ష స్థలాన్ని చీల్చుకొని
మళ్ళీ సూర్యుడు ప్రకాశిస్తాడు!”
ఎంతో ఆశావహ దృక్పథాన్ని కనబరిచిన కవిత్వ పాదాలివి. నాటి ఎమర్జెన్సీ రోజుల్లో నిర్బంధంలో ఉంటూ పరిస్థితులు మారతాయని ఆశాభావాన్ని కనబర్చారు వాజ్ పేయి.
ధర్మరాజును కూడా పాప పంకిలం వదిలిపెట్టలేదన్న సూక్ష్మ పరిశీలన వాజ్ పేయిది. అందుకే
“ధర్మరాజు కూడా
జూద మోహ క్రీడలని వదులు కోలేదు
అందుకే జూద పంకిలం అంటుకున్నది
ప్రతి న్యాయ పంచాయితీలో
పాంచాలియైనా
నిరుపేద స్త్రీయైనా
అవమానితయే
ఇప్పుడు
కృష్ణుడు లేని
మహాభారతం కావాలి”
అంటారు వాజ్ పేయి.
తన కవిత్వం ఓడిపోయిన సైనికుడి నిరాశావాద గుండె చప్పుడు కాదని, విజయం సాధించి తీరతాననే పోరాట యోధుని అచంచల ఆత్మవిశ్వాస దృక్కోణమని పేర్కొంటారు అటల్ జీ. ప్రజల పక్షాన వకాల్తా పుచ్చుకునే న్యాయవాదిగా, మానవతావాదిగా, దేశ సంస్కృతీ సంప్రదాయాల ప్రేమికుడిగా, ప్రజా శ్రేయస్సు కోరుకునే నాయకుడిగా తన కవిత్వంలో కనబడతారు వాజ్ పేయి.  సూక్ష్మ పరిశీలన, భారతీయ దార్శనికతను ఆధునిక భావనలతో విశ్లేషించడం వాజ్ పేయి కవిత్వంలో కనబడతాయి. వాజ్ పేయి శిఖర స్థాయిని నిరాకరించిన శిఖర సమానుడు.


Saturday 23 December 2017

సృజనశీలి పి.వి.

డిసెంబరు 23న మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు వర్ధంతి. ఈ సందర్భంగా నేటి ఆంధ్రజ్యోతి దినపత్రిక హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లలో ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా వ్యాసం. 

Monday 11 December 2017

జాగృతి కవితాంజలి మేడ్చల్ జిల్లా కార్యక్రమం ఫోటోలు



మిత్రులారా,
2017 ఆగస్టు 30నాడు మేడ్చల్ జిల్లాలో జరిగిన జాగృతి కవితాంజలి కార్యక్రమం ఫోటోలు కింది లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. 

Jagruthi Kavithanjali Medchal District Programme Photos- Dr.R.Surya Prakash Rao