Wednesday 28 June 2017

సంస్కరణల మార్గదర్శి ( పి.వి.నరసింహా రావు జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

ఈరోజు (28.06.2017) పి.వి.నరసింహా రావు జయంతి. ఈ సందర్భంగా 'ఆంధ్ర జ్యోతి' దినపత్రిక ఎడిట్ పేజీలో ఈరోజు ప్రచురితమైన నా వ్యాసం.

దేశాన్ని గట్టెక్కించిన మేధావి (పి.వి.నరసింహారావు జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం)

ఈరోజు (28.06.2017) పి.వి.నరసింహారావు జయంతి. ఈ సందర్భంగా 'నమస్తే తెలంగాణ' దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితమైన నా వ్యాసం

Sunday 25 June 2017

రావిచెట్టు రంగారావు దంపతుల కృషికి దర్పణం ( సమీక్ష)


రావిచెట్టు రాజేశ్వర్ రావు గారు రచించిన ‘తెలంగాణ పునర్వికాస వైతాళికులు రావిచెట్టు రంగారావు గారు, లక్ష్మీనర్సమ్మ గారు’ గ్రంథంపై నేను రాసిన సమీక్ష – 2017 జూన్ 25 ‘మన తెలంగాణ’ దినపత్రిక ఆదివారం అనుబంధం ‘హరివిల్లు’ లో ప్రచురితం.

Wednesday 21 June 2017

ఉత్తమ జీవన విధానం యోగ





ఉత్తమ జీవన విధానం
-   డాక్టర్ రాయారావు సూర్య ప్రకాశ్ రావు
ఆధునిక జీవనంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం లేకుండా క్షణం కూడా గడవదు. రోజంతా నిరంతరాయంగా పనిచేస్తున్న టీవీలు దాదాపు అన్ని ఇళ్లలోనూ కనబడతాయి. ప్రతి ఒక్కరి చేతిలోనూ అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు ప్రజా జీవితంలో సమాచార విప్లవాన్ని తీసుకొచ్చాయి. ఏ వార్త అయినా క్షణంలో అరచేతిలోకి చేరిపోతోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లేనిదే క్షణం గడవని ఈ రోజుల్లో వాటివల్ల అనేక ఉపద్రవాలు పొంచుకుని ఉన్నాయి. ఫేస్ బుక్, వాట్స్ అప్ ల నిరంతర వినియోగం కళ్లపై, గుండెపై ఒత్తిడి పెంచుతోంది. నిరంతరం టెన్షన్ కు గురయ్యేలా చేస్తున్నాయి ఆధునిక స్మార్ట్ ఫోన్లు. ఆధునిక జీవన విధానం తీసుకొచ్చిన ఈ మార్పుల పర్యవసానంగా ఆరోగ్యపరంగా, సామాజికపరంగా అనేక నష్టాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
సాంకేతిక విప్లవం పైన పేర్కొన్న సమస్యలను సృష్టిస్తే, ఆధునిక భోజన అలవాట్లు మరిన్ని సమస్యలకు దారితీస్తున్నాయి. మనిషి జీవితంలోని వేగాన్ని ప్రతిబింబించే ఫాస్ట్ ఫుడ్ వాడకం ఆరోగ్యపరమైన సమస్యలను తీసుకొస్తోంది. ఎసిడిటీ, మలబద్దకం, కడుపునొప్పి తదితర ఆరోగ్య సమస్యలు పనిపై ఏకాగ్రతను నిరోధిస్తున్నాయి. ఉత్పత్తి పై కూడా పరోక్షంగా ప్రభావాన్ని చూపుతున్నాయి.
పైన పేర్కొన్న సమస్యలన్నింటికీ ఉత్తమ పరిష్కార విధానం యోగ. అందువల్లే జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవం నిర్వహించాలని 2014 డిసెంబరు 11న ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. యోగ వ్యాప్తి లక్ష్యంగా 2015 నుండి ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలు ఈ వేడుకలను జరుపుకుంటున్నారు.
‘యోగ’ అనే పదం ‘యుజ్’ అనే సంస్కృత పదజన్యమని కొందరు పండితుల భావన. ఐక్యం కావడం, కలవడం మొదలైన అర్థాలు దీనికి ఉన్నాయి. ‘అష్టాధ్యాయి’ కర్త పాణిని అభిప్రాయం ప్రకారం ‘యుజిర్ యోగ’, ‘యుజ్ సమాధౌ’ అనే పదాలనుండి ‘యోగ’ అనే పదం పుట్టింది. పాశం, బంధం, ఏకాగ్రత మొదలైన అర్థాలు ఈ పదాలకు ఉన్నాయి. వీటిలో ‘యుజ్ సమాధౌ’ అనే పదమే సరైనదని అధికుల భావన. పతంజలి కూడా ఈ అభిప్రాయాన్నే వ్యక్తపరిచినట్టు తెలుస్తోంది.
లక్ష్య సాధనకు అవలంబించే ప్రక్రియనే యోగగా మరికొందరు పేర్కొంటారు. శరీరాన్ని, మనసును అదుపులో ఉంచే అత్యుత్తమ విధానంగానూ భావిస్తారు. యోగను ఒక తత్వ శాస్త్ర శాఖగా భావించేవారు కూడా ఉన్నారు.  
పదివేల సంవత్సరాలకు పూర్వమే యోగ ఉందని కొందరు చరిత్ర కారుల అభిప్రాయం. రుగ్వేదంలో కూడా యోగ ప్రసక్తి ఉంది. భగవద్గీత, ఉపనిషత్తులలోనూ యోగ ప్రస్తావన ఉంది.
పాణిని విశ్లేషణ ప్రకారం యోగకు ఎనిమిది అంగాలున్నాయి. మొదటిది యమం. నిబంధనల గురించి చెప్పే అంగమిది. అహింస, సత్యం, అస్తేయం (దొంగతనానికి పాల్పడకపోవడం), బ్రహ్మచర్యం, అపరిగ్రహం (భౌతిక వస్తువులను కలిగి ఉండకపోవడం) అనే ఐదు ఈ అంగంలోని నిబంధనలు.
రెండో అంగం నియమం. వివిధ అలవాట్లు, ప్రవర్తనల గురించి ఈ అంగం తెలియజేస్తుంది. శౌక (శారీరక, మానసిక స్వచ్ఛత), సంతోషం, తపస్సు, స్వాధ్యాయం (వేదాధ్యయనం), ఈశ్వర ప్రాణి ధాన (ఈశ్వరుని గురించి, వాస్తవికత గురించి తెలుసుకోవడం) అనే ఐదు అంశాలు నియమం కిందికి వస్తాయి.
యోగలో మూడో అంగం ఆసనం. సౌకర్యవంతంగా నిలిచి ఉంచే భంగిమగా ఆసనాన్ని పేర్కొంటారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని అందజేసేందుకు పలు ఆసనాలు దోహదం చేస్తాయని ప్రాచీన యోగాచార్యుల విశ్వాసం. వీటిలో పద్మాసనం, వీరాసనం, స్వస్తికాసనం, దండాసనం, సోపశ్రయాసనం, పర్యాంకాసనం, క్రౌంచ- నిషాదాసనం, హస్త నిషాదాసనం, ఉష్ట్ర నిషాదాసనం, సమ సంస్థాపనాసనం, స్థిర సుఖాసనం అనే పన్నెండు ఆసనాలు ప్రధానమైనవిగా భాష్యకారుడు పేర్కొన్నారు.
యోగలో నాలుగో అంగం ప్రాణాయామం. ‘ప్రాణ’, ‘ఆయమ’ అనే రెండు పదాల నుండి ఈ పదం ఏర్పడింది. శ్వాసను క్రమబద్దీకరించడమని ఈ రెండు పదాలకర్థం. ఉచ్చ్వాస, నిశ్వాసల ఆధారంగా ప్రాణాయామం చేస్తారు.
ఐదో అంగం ప్రత్యాహారం. తనను గురించి తాను తెలుసుకోవడం. భౌతిక అంశాల పట్ల మమకారాన్ని తొలగించడం ఇందులో ప్రధానమైనవి.
ఆరో అంగం ధారణం. ఏకాగ్రతను పెంపొందించడమని దీని అర్థం.  
ఏడో అంగం ధ్యానం. ధారణ చేసే పద్ధతే ధ్యానం. మనసుకు విశ్రాంతిని ఇవ్వడం దీని లక్ష్యం.
ఎనిమిదో అంగం సమాధి. అలౌకిక ఆనందంలో తేలియాడే పరిస్థితి ఇది. ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితి ఇది. స్వీయ అస్తిత్వాన్ని సైతం మర్చిపోయే స్థితిగా దీన్ని పేర్కొంటారు.
యోగను ఒక జీవన విధానంగా ఆచరించడం వల్ల అనేక లాభాలున్నాయి. శరీర భాగాల పటుత్వాన్ని పెంచడంలో యోగ ఎంతో ఉపకరిస్తుంది. ఆధునిక జీవన శైలిలో  మనిషి ఎక్కువకాలం ఏదో ఒక పనిపై, వ్యాపకంపై దీర్ఘకాలం కూర్చోవాల్సి వస్తోంది. ఇలాంటి  పరిస్థితుల్లో యోగ చాలా ఉపకరిస్తుంది.
యోగను ఆచరించడం వల్ల శరీరానికి ఎంతో శక్తి వస్తుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. శరీరంలో సమతుల్యత కూడా యోగ వల్ల సిద్ధిస్తుంది. కీళ్లలో దృఢత్వానికి యోగ దోహదం చేస్తుంది. వివిధ శరీర భాగాల్లో నొప్పికి దివ్యౌషధం యోగ. మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నివారణకు యోగ ఎంతగానో ఉపకరిస్తుంది. శరీర సంబంధమైన, మానసిక సంబంధమైన రుగ్మతలను ఎదుర్కోవడంలో యోగ పాత్ర అనిర్వచనీయం. ఆత్మవిశ్వాసాన్ని అందించడంలోనూ యోగ దోహదకారి.
శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మలచడంలో యోగ ఎంతో మేలు చేస్తుంది. అందుకే యోగను కేవలం వ్యాధి వచ్చినప్పుడు ఉపయోగించే ఔషధంలా కాకుండా ఒక జీవన విధానంగా అలవాటు చేసుకోవాలి. జీవితంలో యోగ ఒక భాగం కావాలి.  





Sunday 18 June 2017

‘నేనేమీ... మాట్లాడను’ అంటూనే పాఠకుడితో కవి చేసే ఒడువని ముచ్చట






‘నేనేమీ... మాట్లాడనుఅంటూనే
పాఠకుడితో కవి చేసే ఒడువని ముచ్చట

      - డాక్టర్రాయారావు సూర్యప్రకాశ్రావు

ఎక్కడో ఒక దగ్గర ఒడిసి పట్టుకుంటారు- కదలకుండా... కదిలే ఆలోచన రాకుండా. ముచ్చట మొదలు పెడతారునేనేమీ... మాట్లాడనుఅంటూ. ఏం మాట్లాడనన్నాక ఎవరైనా ఏం చేస్తారు? ‘ ఒక్క ముచ్చట వినిపోఅంటే ఏం చేస్తాం? ‘సరే. ఒక్క ముచ్చటే కదాఅని ఆగిపోతాం. ఒక్క ముచ్చటా వినిపోదామనిపిస్తుంది. ఏం మాట్లాడనంటే కూడా అంతేగా. అలా ఒడుపుగా ఒడిసి పట్టుకున్నాక ఒక్కో ముచ్చట, ఒక్కో ముచ్చట - ఆగకుండా ప్రవహిస్తూనే ఉంటాయి. మొదలైన తర్వాత కదలని పరిస్థితి పాఠకుడిది. కదిలే ఆలోచన కూడా రాని స్థితిలోకి పాఠకుడిని తీసుకుపోయే కవిత్వం కొనకంచిది.

పాఠకుడితో కవి నేరుగా చేసే సంభాషణ కొనకంచినేనేమీ... మాట్లాడను’. కవిత్వంలో వినిపించేవి మాటలు కావు- మనుషుల మనస్తత్వాల సంఘర్షణలు. సంఘర్షణల్లోంచి  పుట్టుకొచ్చిన వేదన. సగటు మనిషి ఆవేదన కంటి నుండి ధారలా కారిపోయి, ఇంకిపోయి, మబ్బుల్లోకి చేరి, ద్రవీభవిస్తే అచ్చం కొనకంచి కవిత్వం లాగే ఉంటుంది. మనిషి ఆవేదనను వర్షించే మబ్బుతునకను కవి మోసుకొస్తాడు. ఉరమనంటూనే ఉరిమే ఉరుము కొనకంచి కవిత్వం. మెరవనంటూనే అన్ని మూలలకూ ప్రసరించే మెరుపు కొనకంచి కవిత్వం.

కొనకంచి విస్పష్టమైన అభిప్రాయాలను ప్రకటిస్తారు . లోపలో మాట, బయటో మాట మాట్లాడే మాట కవిది కాదు. మాట్లాడనంటూ మాట్లాడే మాట ఉండాల్సినంత శక్తివంతమైన కవిత్వం ఆయనది. విషయంలో అయినా మేధావులను దుయ్యబట్టినా, ప్రజాస్వామ్యాన్ని విమర్శించినా - నిక్కచ్చితనం ఆయన కవిత్వం సొంతం. లేనిమాటలు, గాలిమాటలు చెప్పి, ఆత్మవంచన చేసుకునే కవుల కవిత్వం వినాలని ఉందా? అయితే కవిత్వాన్ని అస్సలు చదవకండి. ఉబుసుపోకకు రాసే కవుల కవిత్వం చదువుతూ కాలం గడపండి. మొహమాటంతోఆల్ఈజ్వెల్‌’ అని రాసే అద్భుత కవిత్వాల వాసన ఆఘ్రాణించాలని ఉంటే దయచేసి కవిత్వం చదవడం మొదలు పెట్టకండి. ఎందుకంటే చదవడం మొదలు పెడితే, కవి మిమ్మల్ని చివరివరకూ చదివిస్తారు, మీ అభిప్రాయం మార్చిపారేస్తారు .

రాజకీయంపై చాలామంది కవులు చాలా రకాలుగా విమర్శలు రాశారు. కవి ఆలోచనా ధోరణి భిన్నం. రాసే శైలి విభిన్నం. అందుకే

‘‘ రాజకీయతరం పాలరాతి భవనాలకు

దిష్టి తగలకుండా కట్టిన పేదవాడి తల మాకు కనిపిస్తున్నది’’

అంటారు.

‘‘ రాజకీయతరం మృగభాష మాట్లాడుతుంది’’

అని విమర్శిస్తారు.

కొనకంచికి వర్తమానంపై సందేహాలెన్ని ఉన్నా భవిష్యత్తు బాగుంటుందన్న ఆశావహ దృక్పథముంది. అందుకే

‘‘రేపటి తరాల్లో.. పిరికి మనుషులుండరు

కత్తుల్లాంటి మనుషులు మాత్రమే మిగిలి వుంటారు’’

అన్న ధీమా వ్యక్తం చేస్తారు.

సమకాలీన ఓటు బ్యాంకు రాజకీయాలపై ఎక్కుపెట్టిన కవితాస్త్రం.. మార్చురీ గీతం’. కవితలో ఎన్నిక రాజకీయాలను తూర్పారబడతారు కొనకంచి.

‘‘పార్లమెంటు అంటే మరేమీ కాదు,

అది మీరెన్నుకున్న..

మీరే కావాలని గెలిపించుకున్న

మీ ఆత్మహత్య..’’

అంటారు. శాసనసభపై కూడా ఆయన విమర్శ అలాంటిదే.

‘‘అసెంబ్లీ అంటే మరేమీ కాదు

అది మీరెన్నుకున్న

మీరే కావాలని గెలిపించుకున్న

మీ సొంత వికృత హత్య’’

అంటారు. చట్టసభల ఎన్నికల్లో అనేక ప్రలోభాలు. ప్రలోభాలకు లొంగి వేసే ఓటు వల్ల తమను తామే హత్య చేసుకున్నట్టవుతుందని విమర్శిస్తారు.

ఎన్నికలయిపోయిన తర్వాత ఓటర్లను పట్టించుకునే తీరిక ఎవరికీ ఉండదు. ఎవరూ పట్టించుకోరు. పరిస్థితిని చాలా సమర్థవంతంగా చిత్రించారు కొనకంచి.

‘‘ఎత్తిన జెండా దించేయగానే

జెండా కొయ్య చచ్చిపోతుంది

ఎన్నికలయిపోగానే.. అధికారంలోకి రాగానే

జనం జెండా కొయ్యలైపోతారు

మళ్ళీ ఎన్నికలచ్చేదాకా.. దేశం గోడవున్లో

భద్రంగా .. కుళ్ళిపోతారు.. చెదపట్టి మట్టిగా పోతారు’’

అంటారు. జెండా ఎత్తేదాకా ఎంతో విలువ. దాన్ని దించగానే కొయ్యగా మారిపోతుంది. అందుకే కవి ఎత్తిన జెండాలోకొయ్యఅనే పదాన్ని వాడకుండా దించిన జెండాలో పదాన్ని వాడడం ద్వారా కొయ్యబారిపోవడాన్ని ప్రతీకాత్మకంగా చూపించారు.

పరస్పర విరుద్ధ పదాలతో తన భావాలను ఎలా సమర్థవంతంగా వ్యక్తీకరించవచ్చో కొనకంచికి బాగా తెలుసు. పరస్పర విరుద్ధ పదాలు అనేకం వేర్వేరు సందర్భాల్లో వాడడం కనబడుతుంది. ‘నీలోంచి.. నన్నోసారి ఆవిష్కరించుకుందామనిఅనే కవితలో

‘‘నేను నీకోసం భావసహిత

.. కొంగ్రొత్త రాగమవటం

అసంకల్ప సంకల్పంగా.. జరిగిపోతుంది’’

అంటారు. పంక్తుల్లోఅసంకల్ప, సంకల్పంఅనే పరస్పర వ్యతిరేకార్థక పదాలను వెంటవెంటనే వాడడం ద్వారా తాను చెప్పదలచుకున్న అంశాన్ని ఎంతో బలంగా చెప్పగలిగారు కవి. ‘అసంకల్ప సంకల్పంఅంటే? గందరగోళంలో పడిపోయిన పాఠకుడికి తర్వాతి పంక్తులు వివరణ ఇస్తాయి.

మనిషికీ, మనిషికీ మధ్య అంతులేని అగాధం. మన కళ్ల ముందే తిరుగుతున్న వ్యక్తులు మనకు తెలియదు. ఏవో తెలియని అడ్డుగోడలు. పక్కింట్లో ఉండేవాడే తెలియని విష సంస్కృతిలో మన జీవనం. అందుకే మనుషులు ఒకరికొకరు తెలిసినట్టే ఉంటారు, కానీ తెలియదు. తెలియనట్టే ఉంటారు, కానీ తెలుసు. అందుకేనేనే .. .. పోయెంకవితలో

‘‘పరిచిత.. అపరిచితమయిన నువ్వు

ఇక ఎంతమాత్రమూ కనిపించవు’’

అంటారు.

ఇవే వైరుధ్య పదాల కలయికతో భావాన్ని సమర్థవంతంగా చెప్పడంవాడెలా స్నేహితుడవుతాడు...?’ అనే కవితలో కనబడుతుంది. కొంతమంది ఉన్నత స్థానానికి చేరుకున్న తర్వాత మూలాలను మర్చిపోవడం జరుగుతుంది. తాను స్థాయికి ఎదగడానికి దోహదం చేసిన మిత్రులను, బంధువులను మర్చిపోయే వ్యక్తులు  తరచుగా తారసపడుతుంటారు. అలాంటి వారు ‘స్నేహం’ అనే పదానికే కళంకం తెస్తారు. అలాంటి ఒక ప్రముఖ తెలుగు దర్శకుని స్నేహాన్ని గుర్తుచేసుకుంటారు కవితలో. ఇక్కడ కూడా పైన పేర్కొన్నట్టేపరిచిత, అపరిచితంఅనే వైరి భావాలను ప్రయోగించారు.

‘‘చిర పరిచిత అపరిచితుడైన.. నిన్ను గుర్తు పట్టటం..

ఎవరికీ ఏమంత కష్టం కాదు..

ఫెటిల్లున పగిలిన.. నీ మాయా.. మహల్‌.. ధ్వానం

ప్రపంచమంతా వినిపించే రోజు

చాలా దగ్గరలోనే ఉన్నది..’’

అని వైరుధ్య పదాలను ఉపయోగించారు.

పేరా కొద్దీ వాక్యాలను కుమ్మరిస్తే తప్ప చెప్పలేని భావాలను ఒకే వాక్యంలో చెప్పేయడం కొనకంచికి మంచినీళ్లు తాగినంత పని. ‘మా వూరు పల్లెటూరుకవితలో ఊరిలో నెలకొన్న దైన్యాన్ని వర్ణిస్తారు.

‘‘ఊళ్లల్లో బావులు ఎండిపోయాయి

ఊళ్లల్లో మనుషులు  ఎండిపోయారు’’

అంటారు. బావులు ఎండిపోవడం, మనుషులు ఎండిపోవడం ఒక్కటేనా? హృదయాలను ద్రవింపజేసే వాక్యాలివి. మనిషి తనలోని మంచితనాన్ని పోగొట్టుకున్నాడని ఒకే వాక్యంలో ఆర్ద్రంగా చెప్పగలిగారు.

అమ్మపై చాలామంది కవులు కవిత్వం రాశారు. కొనకంచి కూడా. ‘అమ్మకవితలో

‘‘అమ్మ.. అంటే

తొలకరి మట్టిలో

దాచిన రేపటి కొత్త విత్తనం..’’

అని నిర్వచిస్తారు.

కమ్యూనిజాన్ని, విప్లవాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తారు కొనకంచి. ‘నాకు ఇప్పుడు అసలు నిజం తెలియాలికవితలో

‘‘భవిష్యత్తు దృష్టి ఏమాత్రం లేకుండా

నీ కళ్లకేమో.. కమ్యూనిజం పేరుతో

ఇనుప కచ్చడాలు బిగించుకున్నావు’’

అని కమ్యూనిస్టు నాయకులను విమర్శించారు. కమ్యూనిస్టు నాయకుల్లో ద్వంద్వ వైఖరులు ఉన్నాయని ఆయన ఆరోపణ. అందుకే

‘‘ దేశం మట్టిని ప్రేమిస్తున్నట్టు

పైకి నవ్వుతూ కనిపిస్తావు

కాళ్ల కింద మట్టిని ఎవ్వరూ చూడకుండా

కేజీ లెక్కన అమ్మేందుకు..’’

అని తీవ్రస్థాయిలో విమర్శిస్తారు.

విప్లవాన్ని కూడా విమర్శించారు కొనకంచి.

‘‘విప్లవం అంటే

మనుషుల్ని నడిబజారులో అమ్మటమే అయినప్పుడు

అన్నయ్యా.. విప్లవం పేరుతో

మార్కెట్లో అమ్ముడుపోయిన మనుషులెవ్వరు?

విప్లవం పేరుతో వాళ్ళని అమ్మిందెవరు?’’

అని ప్రశ్నిస్తారు.

పరస్పర సాహచర్యం వల్ల అనేక విషయాలను నేర్చుకుంటాం. మరో మనిషితో స్నేహం అనేక అంశాలను నేర్పుతుంది. అందుకే బయటి ప్రపంచంతో సన్నిహిత సంబంధం ఉన్నవాడు అపారజ్ఞానాన్ని వృద్ధి చేసుకునే అవకాశాలను కలిగిఉంటాడు. విషయాన్నే తెలియజేస్తూ రాసిన కవితమనిషి.. రోడ్డు.. ఒక బుక్ఫెయిర్‌’.

‘‘మనిషంటే

ఆలోచనలు.. అవసరాలు ఉన్న మస్తకం

మనిషిని అర్థం చేసుకోవటం అంటే

బుక్ఫెయిర్లో ఉన్న పుస్తకాలన్నీ హోల్సేల్గా

ఒక్క జన్మలో చదవటమే’’.

అని చెప్తారు.

మనిషి తీరిక లేకుండా అయిపోయాడు. కనీసం ఏడ్వడానికి కూడా సమయం లేనంత బిజీగా కాలం  గడుపుతున్నాడు. ప్రశాంతంగా, తనివితీరా ఏడుద్దామని ఉన్నా జానెడు జాగాలేని పేదవారెందరో. పరిస్థితిని, దైన్యాన్ని చిత్రించిన కవితకాల్మనీ.. ఆంధ్ర ప్రదేశ్‌’.

‘‘కనీసం ప్రశాంతంగా ఏడవటానికి

జానెడు జాగాలేని.. బీదవాళ్లు

నా చుట్టూ ఉన్నప్పుడు

నేను దాచుకున్న నా దు:ఖం కూడా

విలాసవస్తువుగా మారిపోయింది’’

ఎంతో వేదన చిత్రితమైన కవిత ఇది. సుఖం విలాసవస్తువు కావడం సాధారణం. దు:ఖం కూడా విలాసవస్తువుగా మారడమే విషాదం.

మాతృమూర్తిపై కవిత్వాన్ని అనేకమంది కవులు రచించారు. సోదరిపై కూడా చాలా మంది కవిత్వం రాశారు. కానీ పెళ్లి తర్వాత ఇంటిపేరును కూడా మార్చుకుని, తమ జీవితంలో అధికశాతం కాలం  పురుషుడికి సేవలందించే భార్యపై కవిత్వం రాసినవారు తక్కువ. భార్యపై కొనకంచి రాసిన కవితభార్య (ట్రిబ్యూట్టు వైఫ్‌)’. ‘‘మూడు ముళ్లు.. ఏడు అడుగులు / ఒక్క రాత్రితో నేను.. నీకు.. / కొత్త ఇల్లుగా మారాను’’ అంటూ భార్య తన ఉనికిని తాను కోల్పోయిన వైనాన్ని వివరిస్తారు.

‘‘నీకంటూ.. నీకు నువ్వు ఏమీ మిగుల్చుకోకుండా

నీ ఇంటి పేరు కూడా మార్చేసుకున్నావు

వేడి అన్నం మీద పడ్డ.. వెన్న ముద్దలా

నీ.. నెత్తురు వెచ్చించి..

మా జీవితాల అగ్గిలో కరిగిపోయావు’’

భార్య కొత్తగా అత్తవారింట్లో ప్రవేశించిన మరుక్షణం నుండి ఆమె ప్రాధాన్యతను చాలా అద్భుతంగా వివరించిన కవిత ఇది.

కొనకంచి కవిత్వం మొదటి నుండి చివరిదాకా ఆకట్టుకుంటుంది. ఆరంభం ప్రత్యేకం, ముగింపు కూడా ప్రత్యేకం.

వాడెలా స్నేహితుడవుతాడు..?’’ కవితను

‘‘ఇరవయ్యేళ్లప్పుడు.. ఆత్మవంచన.. కే.

నలభయ్యేళ్లప్పుడు కూడా ఆత్మవంచన.. కే...

అరవయ్యేళ్ల దెగ్గిర కూడా..

ఆత్మవంచన ఏంటిరా.. రాక్షసుడా...’’

అనే వాక్యాలతో ప్రారంభిస్తారు. చెప్పబోయే అంశానికి నేపథ్యాన్ని సూటిగా పేర్కొనడం వాక్యాల్లో కనబడుతుంది.

అవును! వెళ్ళిపోయిన వాడెప్పుడూ..’ అనే కవిత

‘‘ సీనియర్సిటిజెన్అడుగు చప్పుళ్లు

మీకు ఇక వినిపించవు

అన్న.. అక్క.. బావా.. అమ్మా..

అన్న అతని మాటలు కూడా ఇక వినిపించవు’’

అనే వాక్యాలతో మొదవుతుంది. గతించిన ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేయబోతున్న విషయం ప్రారంభం చదివితే తెలుస్తుంది.

నటి ఆత్మహత్యకవిత

‘‘అవును..

చావు కూడా కొందరికి ఆఖరి గెలుపే’’

అనే పంక్తుతో ముగుస్తుంది. ‘మా వూరు పల్లెటూరుకవిత

‘‘భవిష్యత్తులో.. పల్లెటూర్లంటే..

కాలిపోయిన పున్నాగ వృక్షాలు.. పాడుపడ్డ రామాలయాలు..

నిర్జీవమయిన ఉదయ సాయంకాలాలు  మాత్రమే’’

అనే వాక్యాలతో ముగుస్తుంది. పల్లెటూరి పరిస్థితిని వివరిస్తూ చివర్లో పరిస్థితులను ఒకే స్టేట్మెంట్రూపంలో చెప్పడం పంక్తుల్లో కనిపిస్తుంది.

మనిషి.. రోడ్డు .. ఒక బుక్ఫెయిర్‌’ అనే కవితలో ఇవీ ముగింపు వాక్యాలు.

‘‘పుస్తకం అంటే మనిషికి

కడవరకూ తోడుండే హృదయం

నేనంటే మరేమీ కాదు

ఒక కొత్త బుక్ఫెయిర్ని.

నడుస్తున్న ప్రాణమున్న మస్తకాన్ని’’.

ముగింపు కూడా స్టేట్మెంట్తోనే ఉండడాన్ని గమనించవచ్చు.

కొనకంచి కవిత్వ ప్రత్యేకత శీర్షికావైవిధ్యం. తన కవిత్వ సంపుటాల పేర్లలో వైవిధ్యంతో చూడగానే ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతారు కొనకంచి. ఆయన రాసినచూపులు వాలిన చోట’, ‘మంత్రలిపిఇందుకు ఉదాహరణలు. ‘నేనేమీ.. మాట్లాడనుకూడా కోవలోకే వస్తుంది. రాబోయే కవితాసంపుటాల శీర్షికలు కూడా వైవిధ్యంగానే ఉంటాయన్న సూచన కూడా కవితా సంపుటిలో ఉంది.

కవితల శీర్షికలు కూడా అంతే. కొన్ని కవితల శీర్షికలు స్టేట్మెంట్స్రూపంలో ఉంటాయి. ‘కత్తి మాత్రమే నిజం మాట్లాడుతుంది’, ‘మరణించేది ఎప్పుడూ యువతరమే’, ‘నిజమే మాస్టారు! మీరన్నది నిజమే’, ‘అందరిలాగే నేనూ వెళ్ళిపోతానుమొదలైనవి ఇందుకు ఉదాహరణలు. వైవిధ్యమైన కవితల శీర్షికలకు ఉదాహరణలురాబోతున్న ఒక డేంజర్గీతం’, ‘నీకు నువ్వే కవిత్వంగా మారాలి’. శీర్షికలు పాఠకుడి చేత కవితను చదివించేలా చేస్తాయి.

కొనకంచి కవిత్వంలో మరో ప్రత్యేకత దీర్ఘత్వం. దీర్ఘ కవితలోనూ చదువరికి ఎక్కడా విసుగు పుట్టకుండా చదివించగల నేర్పరితనం ఆయన సొంతం కాబట్టే దీర్ఘ కవితలైనా పాఠకుడు చివరిదాకా చదివేస్తాడు. బహుశా కొనకంచి కవిత్వంలో బలం దీర్ఘత్వమే. వివిధ కోణాలను స్పృశించి, పాఠకుడిని అన్ని మూలల్లోకీ తొంగిచూసేలా చేయడంలో దీర్ఘత్వం అవసరాన్ని కవి గుర్తించినట్టు ముందుమాటని బట్టి తెలుస్తుంది.

భాషలో, భావంలో, వస్తువులో, శైలిలో విక్షణత సాధించిన కొనకంచి కవితా సంపుటినేనేమీ... మాట్లాడనుకవిత్వపు శక్తికి మరో నిదర్శనం.