Thursday 14 October 2021

కలియుగ సత్యభామ

 


కలియుగ సత్యభామ

-డాక్టర్ రాయారావు సూర్య ప్రకాశ్ రావు,

9441046839

ఆ అమ్మాయి రూపురేఖలు నృత్యానికి ఏమాత్రం సరిపోవని నాటి గురువులన్నారు. నృత్య అభ్యసనకు పనికిరాదన్న తిరస్కారాలు పొందిన ఆమె పట్టుదలతో నృత్యసామ్రాజ్యంలో ఉన్నతశిఖరాలను చేరారు. ముద్రలు సరిగ్గా లేవన్న విమర్శలను పొందిన ఆమె అనంతర కాలంలో శాస్త్రీయ నృత్యంలో తనదైన ముద్ర వేశారు. కూచిపూడి అభినయానికి దేశ విదేశాల్లో గొప్ప పేరు తెచ్చిపెట్టారు. చలనచిత్రాల్లో ఎన్నో అవకాశాలు వచ్చినా ప్రఖ్యాత నాట్య కళాకారిణి రుక్మిణీ దేవి అరండేల్ కు ఇచ్చిన మాట మేరకు ఆ అవకాశాలన్నింటినీ సున్నితంగా తిరస్కరించారు. నాట్యకళకే అంకితమయ్యారు. విశేషకృషితో పద్మశ్రీ బిరుదాంకితులయ్యారు. ఆ నృత్య చూడామణి శోభానాయుడు.

కూచిపూడిలో నవరస అభినయంతో ప్రేక్షకులను అలరించిన శోభానాయుడు 1956లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించారు. చదువులో ఎప్పుడూ ప్రథమ స్థానంలో నిలిచే ఆమెలో నృత్యం అభ్యసించాలన్న ఆకాంక్ష బలంగా ఏర్పడింది. సంప్రదాయ కుటుంబం కావడంతో తండ్రి వెంకటనాయుడుకు ఆమె నాట్యం నేర్చుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఆమె అభిరుచికి తల్లి సరోజినీ దేవి ప్రోత్సాహం తోడు కావడంతో కూచిపూడి అభ్యసనలో తొలి అడుగులు వేశారు. అయితే ఆ అమ్మాయి రూపురేఖలు నృత్యానికి ఏమాత్రం సరిపోవని నాటి గురువులు నిరాశపర్చారు. వారి మాటలు ఆమెలో పట్టుదలను పెంచాయి. రాజమండ్రిలో పి.ఎల్.రెడ్డి వద్ద తొలి పాఠాలు నేర్చుకున్న అనంతరం ప్రఖ్యాత నృత్య గురువు వెంపటి చినసత్యం దగ్గర కూచిపూడి అభ్యసించేందుకు చెన్నై పయనమయ్యారు. తన కూతురును డాక్టరుగా చూడాలని ఆశపడ్డ వెంకటనాయుడు అయిష్టంగానే ఒక షరతుతో ఆమె చెన్నై వెళ్ళేందుకు అంగీకరించారు. అరంగేట్రం తర్వాత ప్రదర్శనలివ్వడం మానేయాలన్నది ఆ షరతు. షరతుల వారధి మీదుగా చెన్నై పయనించిన శోభానాయుడుకు అరంగేట్రం తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో ఇక వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు.

వెంపటి చినసత్యం ముఖ్య శిష్యురాలిగా కూచిపూడి నృత్యంలో శిఖరారోహణ చేశారు శోభానాయుడు. గురువు రూపొందించిన పలు నృత్య నాటకాల్లో ఆమె ప్రధాన పాత్ర పోషించారు. సత్యభామగా, పద్మావతిగా, చండాలికగా నవరస నృత్యాభినయానికి మారుపేరుగా నిలిచారు. లయబద్ధంగా చురుకుగా కదిలే శోభానాయుడు పాదాలు, శిల్ప సదృశ దేహ భంగిమలు, ముఖంలో ప్రతిబింబించే భావాలు, నేత్రాభినయం, కనురెప్పల కదలికలు, కనుబొమ్మల ముచ్చట్లు, హస్త ముద్రలు ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచెత్తేవి. ‘భామనే... సత్యభామనే..’ అంటూ సిద్ధేంద్ర యోగి తీర్చిదిద్దిన సత్యభామగా వేదికపై శోభానాయుడు అభినయం ఆమెకు ‘కలియుగ సత్యభామ’గా పేరు తెచ్చిపెట్టింది. 80వైయక్తిక ప్రదర్శనలకు, 15నృత్య రూపకాలకు ఆమె రూపకల్పన చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, ఇంగ్లాండు, సిరియా, టర్కీ, హాంకాంగ్, బాగ్దాద్, కంపూచియా, బ్యాంకాక్, వెస్టిండీస్, మెక్సికో, వెనిజులా, ట్యునీషియా, క్యూబా, పశ్చిమాసియా తదితర ప్రాంతాల్లో ప్రదర్శనలిచ్చి, కూచిపూడి కళకు ప్రాచుర్యం కల్పించారు. దేశం ప్రతినిధులుగా వివిధ దేశాల్లో పర్యటించిన భారతీయ కళాకారుల బృందానికి ఆమె నాయకత్వం వహించారు. ‘తానా’ ఆధ్వర్యంలో  అమెరికాలోని పలు ప్రాంతాల్లో నృత్య ప్రదర్శనలు చేశారు.

నృత్య రంగంలో విశిష్ట సేవలందించినందుకు కేంద్రప్రభుత్వం 2001లో ఆమెను ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. సంగీత నాటక అకాడమీ పురస్కారాన్ని 1991లో శోభానాయుడు పొందారు. చెన్నై లోని కృష్ణ గాన సభ 1982లో ఆమెను ‘నృత్య చూడామణి’ బిరుదుతో సన్మానించింది. 1996లో నృత్య కళా శిరోమణి పురస్కారాన్ని, 1998లో ఎన్టీరామారావు అవార్డును, 2001లో తంగిరాల కృష్ణ ప్రసాద్ స్మారక పురస్కారాన్ని పొందారు. ఇవే కాకుండా పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, సత్కారాలను, ఎన్నో బిరుదులను ఆమె పొందారు.

దేశ విదేశాల్లో కూచిపూడికి విశేష ప్రాచుర్యం కల్పించిన శోభానాయుడు హైదరాబాదులో కూచిపూడి డ్యాన్స్ అకాడమీని నెలకొల్పారు. అకాడమీ ప్రిన్సిపాల్ గా పనిచేశారు. కూచిపూడి అభ్యసనం తల్లిదండ్రులకు భారం కాకూడదన్న సదుద్దేశ్యంతో అతి తక్కువ ఫీజుతో అకాడమీలో కూచిపూడి నేర్పించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు రెండువేల మందికి కూచిపూడి నృత్యాన్ని బోధించారు.

శోభానాయుడు తన జీవితాన్ని పూర్తిగా కూచిపూడి నృత్యానికే అంకితం చేశారు. నేతి శ్రీరామశర్మ దగ్గర కర్ణాటక సంగీతం అభ్యసించినా, పూర్తిదృష్టి కూచిపూడి నృత్యంపైనే పెట్టారు. నాట్యంలో ఆమె నైపుణ్యానికి ఆశ్చర్య భరితులైన  ప్రముఖ భరతనాట్య గురువు వళ్లువూర్ బాగ్యతమ్మాళ్ రామయ్య పిళ్ళై ఆమెకు ఉచితంగా భరతనాట్యం నేర్పుతానన్నారు. పిళ్ళై అన్నా, భరతనాట్యమన్నా తనకు అభిమానమేనని, అయితే కూచిపూడి నేర్చుకునేందుకు తన జీవితకాలం సరిపోదని సున్నితంగా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు శోభానాయుడు. తెలుగులో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సిరిసిరి మువ్వ’ను హిందీలో ‘సర్గం’ పేరుతో పునర్మిర్మించే సందర్భంలో ఆ సినిమాలో నటించేందుకు ఆమెకు అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమాతో పాటు పలు ఇతర సినిమాల్లోనూ నటించేందుకు వచ్చిన అవకాశాలను శోభానాయుడు వదులుకున్నారు. కూచిపూడి నాట్యం తనకు మొదటి ప్రాధాన్యత కావడం ఇందుకు ఒక కారణమైతే ప్రఖ్యాత నాట్య కళాకారిణి రుక్మిణీ దేవి అరండేల్ కు ఇచిన మాట ఒక కారణం. శోభానాయుడు లోని ప్రతిభను అరంగేట్రం నాడే గుర్తించిన రుక్మిణీదేవి సినిమాల్లోకి వెళ్ళనన్న హామీని శోభానాయుడు నుండి పొందారు.     

కూచిపూడి కళకు విశేష ప్రాచుర్యం తెచ్చిన శోభానాయుడు గత ఏడాది అక్టోబరు 14వ తేదీన కన్ను మూశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను అభినయంతో అలరించిన ఆ కళ్లు శాశ్వత నిద్రలోకి జారుకున్నాయి. ‘కూచిపూడి నృత్యం ద్వారా పొందే ఆత్మ సంతృప్తి, మానసిక ప్రశాంతత, వైద్యపరమైన ప్రయోజనాలను కీర్తి, కాసులతో ముడి పెట్టలేమ’ని పేర్కొన్న శోభానాయుడు నృత్యాభినయం ఎప్పుడూ మర్చిపోలేనిది.


(సందర్భం: ప్రఖ్యాత నాట్య కళాకారిణి శోభానాయుడు తొలి వర్ధంతి అక్టోబరు 14వ తేదీ)

Saturday 15 May 2021

బాలరాజు నుండి కలైడోస్కోప్ దాకా..

 


‘కంచి రాజధానిగా పాలించాడు.. ఇది మంచి రేవు పట్నంగా కట్టించాడు’ అని పల్లవ రాజుల పాలనను, మహాబలిపురాన్ని, కాంచీపురాన్ని ప్రస్తావించే పాట మీకు గుర్తుండే ఉంటుంది. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘బాలరాజు కథ’ సినిమాలోని పాట ఇది.

అసలు కంచి.. కాంచీపురం.. ఈ పేర్లు వినగానే మీకేం గుర్తొస్తుంది?
కొందరికి దేవాలయాలు, మరి కొందరికి పట్టు చీరలు.
కొందరికి శక్తి పీఠం, కొందరికి కామ కోటి పీఠం.
కొందరికి ఆధ్యాత్మిక విద్యా కేంద్రం, కొందరికి ఆధునిక విద్యా కేంద్రం.
కొందరికి కామాక్షి, కొందరికి ఏకాంబరేశ్వరుడు.
కొందరికి ఆది శంకరాచార్యులు, కొందరికి రామనుజాచార్యులు.
కొందరికి పల్లవుల రాజధాని, కొందరికి బంగారు బల్లి నిలయం.
తమిళనాడులోని జిల్లా కేంద్రం కాంచీపురానికి ఎన్నో ప్రత్యేకతలు. చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా, వాణిజ్యపరంగా ప్రఖ్యాతి చెందిన పట్టణమిది. హైందవులకే కాకుండా జైనులకు, బౌద్ధులకు కూడా ఇది తీర్థ యాత్రా స్థలం.

‘అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా - పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయికాః’ అన్నారు. అంటే దేశంలోని సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి అన్నమాట. పంచభూత క్షేత్రాలలో ఇక్కడి ఏకాంబరేశ్వర దేవాలయం ఒకటి. ఇక్కడి కామాక్షి దేవాలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి. పల్లవులు రాజధానిగా చేసుకుని పాలించిన ఈ పట్టణం మోక్షవిద్యకు, అద్వైతవిద్యకు ఇది మూలపీఠం. ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠం ఇక్కడిదే. క్రీ. పూ. రెండో శతాబ్దంలో పతంజలి రాసిన మహాభాష్యాలలో కూడా కంచి ప్రస్తావన ఉంది. బుద్ధుడు ఈ పట్టణాన్ని సందర్శించాడు. చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ కూడా కాంచీపురాన్ని సందర్శించాడు. ఎన్నో దేవాలయాలకు నిలయమిది. కామాక్షి, ఏకాంబరేశ్వర, వరదరాజ పెరుమాళ్ తదితర దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇతర ఏ క్షేత్రంలోనూ లేని మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ క్షేత్రంలోని బంగారు బల్లిని స్పృశించిన వారిని నమస్కరించినా బల్లిపాటు వల్ల కలిగే అనార్థాలు దరి చేరవన్న నమ్మకం ఉంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని సందర్శించినవారు కూడా వందనీయులే!

సరే .. కంచి పట్టు చీరల ప్రత్యేకత మనలో చాలామందికి తెలుసు. ఈ పట్టణంలో సుమారు ఐదు వేల కుటుంబాలవారు చేనేత వృత్తిని ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు.

కంచిలో మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే కాంచీపురం ఇడ్లీ.
కావలసిన పదార్థాలు:
మినపపప్పు- 1 గ్లాసు, ఉప్పుడు బియ్యం- 1 గ్లాసు, ఇడ్లీ బియ్యం- 1 గ్లాసు, నెయ్యి- తగినంత, నూనె- తగినంత, ఉప్పు-తగినంత, కరివేపాకు, పచ్చిమిర్చి-1 లేదా 2, ఇంగువ- సగం టీ స్పూన్, ఆవాలు- సగం టీ స్పూన్, కాజు- అవసరమైనన్ని , జీలకర్ర పొడి- సగం టీ స్పూన్, మిరియాల పొడి - సగం టీ స్పూన్, శొంఠి పొడి - సగం టీ స్పూన్, అల్లం- తరిగిన 3 చిన్న ముక్కలు

చేసే పద్ధతి:
1. ముందుగా మినపప్పు, ఉప్పుడు బియ్యం, ఇడ్లీ బియ్యం- మూడూ సమాన పరిమాణాల్లో తీసుకోవాలి. మూడు గంటలపాటు నీళ్లలో నానబెట్టాలి.
2. మూడు గంటల తర్వాత ఈ మూడింటిని గ్రైండ్ చేయాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్తం గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కనీసం 8 గంటల పాటు పులియబెట్టాలి.
3. ఎనిమిది గంటల తర్వాత ఈ మిశ్రమానికి అవసరమైనంత ఉప్పు కలపాలి.
4. తర్వాత ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి ని వేసి, కాజు (జీడిపప్పు)ను వేయించుకోవాలి. ఈ వేయించిన కాజును మిశ్రమంలో కలుపుకోవాలి.
5. తర్వాత కొద్ది నూనెలో ఆవాలు, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, కరివేపాకు, మిరియాల పొడి, శొంఠి పొడి, ఇంగువ వేయాలి. కొద్ది సేపు వేయించాలి. ఇది చల్లారిన తర్వాత మిశ్రమంలో కలపాలి.
6. ఇడ్లీ పాత్రలో ముందుగా నీళ్లు తగినన్ని పోసుకోవాలి. నీటి పైన మనం మామూలుగా ఇడ్లీలు చేసుకునే పాత్రను పెట్టాలి.
7. చిన్న చిన్న గిన్నెలు లేదా గ్లాసులకు నెయ్యిని/ నూనెను రాయాలి. వాటిలో సగ భాగం పిండి వేసుకోవాలి. ఈ గిన్నెలు లేదా గ్లాసులు ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టాలి.
8. అరటి ఆకులు మొదలైనవి కూడా గిన్నెలు, గ్లాసుల్లో పెట్టి; వాటిలో పిండి వేయవచ్చు. అయితే ఆకులు పెడితే నూనె, నెయ్యి రాయాల్సిన అవసరం లేదు.
9. ఇప్పుడు 25, 30 నిముషాలు ఆవిరిపై ఉడికించిన తర్వాత దించేయాలి.
10. గిన్నెలు, గ్లాసుల నుండి ఇడ్లీ వేరు చేసిన తర్వాత వాటిని చిన్న పరిమాణంలోకి కట్ చేసుకోవాలి.
11. ఇప్పుడు వేడి వేడి కాంచీపురం ఇడ్లీ రెడీ. దీన్ని సాంబారుతో గానీ టమాట చట్నీతో గానీ లాగిస్తే మరోసారి కాంచీపురాన్ని మర్చిపోరు.

‘పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి’ లోకోక్తికి వ్యతిరేక ఉదాహరణగా నిలిచి, మీ ఇంట్లోని అన్ని జిహ్వల చాపల్యాన్ని తీరుస్తుంది ఈ కాంచీపురం ఇడ్లీ.

నా బాల్యంలో కలైడోస్కోప్ లో సినిమారీళ్ల ముక్కలు పెట్టి చూపించేవారు. ఆ సందర్భంలో కలైడోస్కోప్ తిప్పే అతను రీళ్లను మారుస్తూ పాడిన మరో పాట లీలగా గుర్తొస్తోంది.. ‘కంచిపట్నం చూడర బాబూ చూడర బాబూ..’ (బహుశా అతను ‘కాశీపట్నం చూడర బాబు..’ పాటను అనుకరించాడేమో!) 

Tuesday 23 March 2021

కుంభకర్ణ నిద్ర

 

దాదాపు పాతికేళ్ల కిందటి ముచ్చట. అప్పుడే బీఈడీ పూర్తి చేసుకుని కాలేజీ నుండి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాం. ఒక మిత్రుడు, నేను హైదరాబాదు నగర శివార్లలో అద్దెకు ఉండేవాళ్ళం. రెండు గదుల పోర్షన్. లోపలి గదిలో పడక. రూం బయట కొద్ది దూరంలో టాయిలెట్ ఉండేది. నాతో పాటు ఉన్న రూమ్మేటుకు ఒక అర్ధరాత్రి అర్జెంటుగా బయటికి టాయిలెట్ కి వెళ్ళవలసి వచ్చింది. గాఢ నిద్రలో ఉన్న నన్ను నిద్ర నుండి లేపాడు. “బయటికి టాయిలెట్ కి వెళ్తున్నాను” అని చెప్పాడు. “సరే”నన్నాను. తలుపు తీసి బయటికి వెళ్ళాడు. నాకేమో నిద్ర ముంచుకొస్తోంది. తలుపు తెరిచి పడుకుందామంటే దొంగల భయం. “రూమ్మేటు వచ్చాక తలుపు తడితే ఎలాగూ లేచి తలుపు తీయొచ్చులే” అనుకుని తలుపు పెట్టి, లోపలి గదిలో నిద్రపోయాను.

*****

తెల్లవారుజామున మెలకువ వచ్చింది. పక్కన చూస్తే మిత్రుడు లేడు. “ఎక్కడికెళ్ళాడా” అని కొన్ని సెకన్లు ఆలోచిస్తే, రాత్రి అతను బయటికి వెళ్ళిన విషయం గుర్తొచ్చింది. “ఇంతసేపైనా ఇంకా రాలేదేంటి?” అనుకుంటూ తలుపు తెరిచాను. బయట చూసేసరికి పక్కింటి వాళ్ల చిన్న ఆటోలో నిద్రలో కూడా దోమలను  కొట్టుకుంటూ, మోకాళ్లు దగ్గరికి ముడుచుకుని, సర్దుకుని పడుకున్న మిత్రుడు కనబడ్డాడు. వెళ్ళి లేపాను. “ఏంటి? ఇక్కడ పడుకున్నావ్?” అని అడిగాను. “ఏం చేయాలి మరి? రాత్రి ఎంతో సేపు తలుపు కొట్టాను. నువ్వు తీయలేదు” అన్నాడు. ఇంతలో అలికిడికి పక్కింటివాళ్లు వచ్చారు. “ఏం సార్? పాపం సార్ రాత్రి ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తీయలేదు?” అని ప్రశ్నించారు. “మేం కూడా చాలాసేపు తలుపు కొట్టాం సార్. మీరు లేవలేదు” అని చెప్పారు. “లోపలి రూంలో నిద్ర పోయాను కదా. వినబడలేదు” అని చెప్పాను. మిత్రుడికి సారీ చెప్పాను.

కానీ అంతమంది తలుపు కొట్టినా మెలకువ రాకపోవడం ఇప్పుడు తలుచుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నా మొద్దు నిద్రతో మిత్రుడిని ఇబ్బంది పెట్టినందుకు బాధగానూ ఉంటుంది.  

అదే కదా కుంభకర్ణ నిద్ర అంటే!